iBOMMA: పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు సంపాదించిన ఐ బొమ్మ ఇమ్మడి రవి?
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:01 PM
ఆరు సంవత్సరాల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశాడు రవి. థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తున్న నిందితుడు రవి కారణంగా టాలీవుడ్ నిర్మాతలకి వేలాది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.
హైదరాబాద్, నవంబర్ 15: మొత్తానికి 'ఐ బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడ్ని నాంపల్లి కోర్టుకి తరలించారు. 2019 నుండి 'ఐ బొమ్మ' వెబ్‌సైట్‌లో పైరసీ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నరవి.. ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‌పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఐ బొమ్మతోపాటు, 65 పైరసీ వెబ్సైట్ లపై కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నన్ను పట్టుకోలేరంటూ గతంలో పోలీసులకే సవాలు విసరాడు రవి. ఈ నేపథ్యంలో రవిని ఈరోజు ఉదయం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి నుంచి సేకరించిన వివరాలతో రవి ఏజెంట్ల నెట్వర్క్‌తోపాటు హ్యాండ్లర్ల నెట్వర్క్ పై కూడా సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన
కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.