Harish Rao: సన్నబియ్యం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే హరీశ్ రావు..
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:54 PM
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో ఎంత స్పీడ్‌గా ఆ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్‍గా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

సిద్దిపేట జిల్లా: సన్నబియ్యం పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. పేదలకు సన్నబియ్యం పేరుతో 40 శాతం నూకలే ఇస్తున్నారని ఆగ్రహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలకు ఏ విధంగా నూకలు లేని సన్నబియ్యం ఇచ్చామో, అదే విధంగా కాంగ్రెస్ హామీ మేరకు అర్హులందరికీ స్వచ్ఛమైన బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో మాజీ మంత్రి సమావేశం అయ్యారు. ఈనెల 27న వరంగల్ వేదికగా నిర్వహించే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలు విసిగిపోయారు..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.." దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. తెలంగాణలో ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్‍గా ఓడిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడానికి, కుదవపెట్టడానికి వీలులేకుండా పోయింది. రేవంత్ పాలనపై ప్రజలు విసిగిపోయారు. వ్యాపారాలు నడవడం పేదని వ్యాపారులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు, షాపులు కిరాయికి దొరికేవి కావు. ఇప్పుడు ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులు కనపడుతున్నారు. దేవుడిపై ఒట్టు పెట్టి ఆయన్నే మోసం చేసిన వ్యక్తి రేవంత్.
భూముల తనఖా నిజం కాదా..?
రుణమాఫీ విషయంలోనూ రైతులను కాంగ్రెస్ మోసగించింది. ఓ మండలంలో 5,100 మందికి రుణమాఫీ అయితే మరో 7,300 మందికి కాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలోనూ రైతు బంధు ఇచ్చారు. కానీ, రూ.14వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణ మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. రైతులు చెట్లు నరికితే కేసులు పెట్టినప్పుడు మరి 400 ఎకరాల్లో చెట్లు నరికిన రేవంత్ రెడ్డిపై పెట్టరా?. కంచె గచ్చిబౌలి భూములు 400 ఎకరాలను కుదవపెట్టి ముఖ్యమంత్రి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చారు. రూ.170 కోట్ల లంచం ఇచ్చి మరీ అప్పులు తెచ్చారు. ప్రశ్నిస్తే భూములు తనఖా పెట్టలేదని బుకాయిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టా. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తే.. నేటి ప్రభుత్వం వారిని ఇబ్బందులు పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరు.
ఎంతో ప్రత్యేకం..
ఈనెల 27 వరంగల్ సభను విజయవంతం చేయాలి. ఎన్నికల వేళ తప్ప పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ పెద్ద మీటింగ్‍లు పెట్టలేదు. ప్రస్తుతం నిర్వహించే వరంగల్ సభ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి లక్ష మంది హాజరు కావాలి. నాయకులు సమావేశానికి కార్లలో రాకుండా కార్యకర్తలతో బస్సుల్లోనే రావాలి. సభకు వచ్చిన కార్యకర్తలను ఇంటి వరకూ సురక్షితంగా చేర్చే బాధ్యత వారిదే. మహిళా కార్యకర్తలు, నాయకురాళ్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరుకావాల్సిందే. ఈ సభ ఎంతో ప్రత్యేకమని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MLA Komatireddy: నాకు మంత్రి పదవి రాకుండా చూస్తోంది అతనే: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
Hyderabad: యువకుడిని తరిమిన ట్రాఫిక్ పోలీసులు.. చివరికి ఏమైందంటే..
Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్ కారు