Share News

KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...

ABN , Publish Date - Apr 12 , 2025 | 09:26 AM

మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని అన్నారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ కొనియాడారు.

KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...
Vanajeevi Ramaiah death

హైదరాబాద్: వనజీవి రామయ్య మరణం (Vanajeevi Ramaiah death) పచ్చదనానికి (Greenery) తీరని లోటని, తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (Ex CM KCR) అన్నారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన కృషిని స్మరించుకున్నారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వృక్షో రక్షతి రక్షితః ’ అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని కొనియాడారు.


మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణకు హరిత హారం ... ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామయ్య అందించిన సహకారం గొప్పదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావనీ కేసీఆర్ పునరుద్ఘాటించారు.


పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేసారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


కాగా పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా ఉంటే దగ్గరలోని ఆర్ఎంపీకి చూయించి ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే రామయ్య చనిపోయారు. కోటి మొక్కలకు పైగా వనజీవి రామయ్య, జానకమ్మ దంపతులు నాటారు. కోటికి పైగా మొక్కలను నాటి వనజీవి రామయ్య చరిత్ర సృష్టించారు. . మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే ప్రచారం చేశారు. మొక్కలు నాటుతూ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య సేవ చేశారు. వనజీవి రామయ్యకు నలుగురు పిల్లలు.. వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వనజీవి రామయ్య భార్య పేరు జానకమ్మ.

Updated Date - Apr 12 , 2025 | 09:26 AM