Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:18 PM
బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ చికెన్‍కు డిమాండ్ తగ్గి మటన్, చేపలకు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ధరలు 30 శాతం మేర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. కోళ్ల ఫారాల్లో వేల కోళ్లు మృతిచెందుతుండడంతో వ్యాపారాలు గగ్గోలు పెడుతున్నారు. రోగాలు వస్తాయన్న భయంతో ప్రజలెవ్వరూ చికెన్ షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో చికెన్ రేట్లు అమాంతం పడిపోయాయి. అయితే వ్యాపారులు మాత్రం బర్డ్ ఫ్లూపై అపోహలు పోగొట్టేందుకు వివిధ ప్రాంతాల్లో చికెన్ పకోడి, బిర్యానీ వంటి వంటకాలు చేస్తూ ప్రజలకు ఉచితంగా పంచి పెడుతున్నారు. అయినా చికెన్ వద్దు.. మటన్, చేపలే ముద్దంటూ వినియోగదారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు.
అయితే అందరూ మటన్, చేపలు కొనుగోలు చేసేందుకు ఎగబడడంతో ఒక్కసారిగా రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే వీటికి డిమాండ్ 40 నుంచి 50 శాతం మేర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్, సప్లై సూత్రం ప్రకారం.. డిమాండ్ పెరగడంతో సప్లై తగ్గి రేట్లు పెరిగినట్లు భావిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ చికెన్‍కు డిమాండ్ తగ్గి మటన్, చేపలకు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ధరలు 30 శాతం మేర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్లకు చేపల సరఫరాలో సంక్షోభం కారణంగా ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. మెున్నటి వరకూ ఒక్క మటన్ ధరే పెరగడంతో ఎక్కువ మంది చేపలవైపు మెుగ్గు చూపారు. తాజాగా వీటి ధరలకూ రెక్కలు రావడంతో కొనుగోలు దారుల్లో ఆందోళన మెుదలైంది.
చేపలు.. గత, ప్రస్తుత రేట్లు (కిలోకు)..
రొయ్యలు - రూ.380, రూ.450
బంగుడు- రూ.200, రూ.250
ఏంజెల్- రూ. 650,రూ.850
సీజన్- రూ. 200, రూ.300
పీతలు- రూ.180, రూ.300
శంకర చేప- రూ.250, రూ.320
రాక్ చేప- రూ.350, రూ.400
ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి?
ఈ ఏడాది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా చేపల ఉత్పత్తి తగ్గి సరఫరాలో కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రజలంతా ఒక్కసారిగా చేపలను ఎక్కువ మెుత్తంలో కొనుగోలు చేస్తున్నందున డిమాండ్ పెరిగి సప్లై తగ్గిందని అంటున్నారు.
రవాణా, నిల్వ, ఇంధన ఖర్చుల పెరుగుదల కారణంగానూ చేపల ధరలకు రెక్కలొచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఈ ధరల పెరుగుదలతో తాత్కాలికంగా మటన్, చేపల వ్యాపారులు లబ్ధి పొందినా దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే సదరు వ్యాపారులు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచితే ప్రజలు తమ ఆహారపు అలవాట్లు మార్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. భారీగా వెచ్చించి మాంసాన్ని కొనుగోలు చేయటం ఇష్టం లేక వారంతా శాఖాహారం వైపు మళ్లొచ్చని చెబుతున్నారు. అలా జరిగితే వ్యాపారులకు భారీ నష్టం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మటన్, చేపల రేట్లు తగ్గించాలని పలువురు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Chicken Tikka masala Cake: మీరెప్పుడైనా చికెన్ టిక్కా మసాలా కేక్ తిన్నారా.. అయితే మీ కోసమే..
CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్‍పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..