Cold-wave: తెలంగాణలో ఎముకలు కొరికే చలి..
ABN , Publish Date - Nov 14 , 2025 | 08:27 PM
చలి తీవ్రతకు బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. అంత స్థాయిలో చలి తీవ్రత పెరిగిపోయింది. భాగ్యనగరంలోనే కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రతకు జనం గజగజలాడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చలికి జనం వణికిపోతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. నిన్నటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఐఎండీ ప్రకారం నవంబర్ 17 వరకు చలి తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజన్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలలో తగ్గుదల ఎక్కువగా ఉంటుందని, నవంబర్ 18 వరకూ చలిగాలులు ఎక్కువగా వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
సిర్పూర్ ప్రాంతంలో 10.2 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ 11.1 డిగ్రీల వద్ద ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా పడిపోయాయి.
అటు, రాజధాని హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. శేరిలింగంపల్లిలో అతి తక్కువగా 13.2డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 14.8 డిగ్రీలు ఉన్నాయి. ఉత్తరాది నుండి కొనసాగుతున్న పొడి గాలులు, క్లియర్ స్కై, రాత్రిపూట చలి తీవ్రతకు కారణమవుతున్నాయని ఐఎండీ అధికారులు అంటున్నారు.
వచ్చే నాలుగు రోజుల్లో తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8–10 డిగ్రీలకి పడిపోవచ్చని, హైదరాబాద్‌లో నవంబర్ 14 నుంచి 18 మధ్య పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. ప్రజలు ముందుగా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..