Ministerial Meeting: రేపు మంత్రులతో సీఎం కీలక భేటీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:30 AM
అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిరా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
పంచాయతీ ఫలితాలపై గణాంకాలతో సమీక్ష
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ
రెండు రోజుల్లో 26 కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ!
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిరా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో ఈ కీలక భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధానం గా.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. మంత్రుల నియోజకవర్గాలతో పాటు, మంత్రులు ఇన్‌చార్జులుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎన్నిచోట్ల సర్పంచ్ స్థానాలను గెలుచుకుందన్న అంశంపై ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీ ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఇతర పార్టీ లు బలపర్చిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైనా మాట్లాడే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోందని సమాచారం. అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగానే తాజాగా సొసైటీల ప్రస్తుత పాలకవర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ముడిపడి ఉంది. మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ బీసీల రిజర్వేషన్ల అంశం చర్చకు రాలేదు. దీంతో పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై మంత్రుల సమావేశంలో చర్చించనున్నారు. తర్వా త, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి, ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్లాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. సీఎం, మంత్రుల భేటీ ఎజెండాలలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశం కూడా ఉండనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కంపెనీలు చేసుకున్న ఒప్పందాల గురించి మాట్లాడనున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు మళ్లీ
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేసింది. పనితీరు సరిగా లేని వారితో పాటు, మరికొంత మందిని కూడా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో పనిచేసే వారితో పాటు జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలుగా పనిచేసేవారిని కూడా బదిలీ జాబితాల్లో చేర్చనున్నట్టు సమాచారం. అధికారుల బదిలీల అంశంపైనా స మావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
24న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక
కోస్గి, కొడంగల్: ఈ నెల 24న సీఎం రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి రానున్నారు. ఈమేరకు శనివారం నారాయణపేట ఇన్‌చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ స్థల పరిశీలన చేశారు. పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసే లక్ష్మినరసింహ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. కొడంగల్ నియోజకవర్గంలోని 8మండలాల్లో గెలిచిన నూతన సర్పంచులతో సీఎం అభినందన సభ నిర్వ హించనున్నారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అనంతరం వారితో కలిసి సహఫంక్తి భోజనం చేయనున్నారు. అందుకు కాడ అధికారి వెంకట్‌రెడ్డితో కలి సి కలెక్టర్ సంచిత్‌గంగ్వార్ స్థల పరిశీలన చేశారు.
కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపైన కూడా
త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సొసైటీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మధ్యలోనే పలు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండుమూడు రోజుల్లో 26 కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపైనా సోమవారం సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో కొంత మందికి ఆశావహులకు పదవి దక్కలేదు. అలా పదవి దక్కనివారిలోనూ కొంత మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే.
29, 30, 31 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు?
శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నట్లు, ఈ మేరకు మంత్రులకు సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అధికార వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అనంతరం దీనిపై నిర్ణయాన్ని కూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Govt School Teachers Struggle: యాప్‌లతో సరి.. పాఠాలు ఎలా మరి!
Hyderabad Book Fair 2025: రెండో రోజు బుక్ ఫెయిర్‌కు అద్భుత స్పందన