Share News

CM Revanth Reddy: USISPF సమ్మిట్.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:49 PM

గ‌త 23 నెల‌ల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, పరిశ్రమలకు అనువైన వాతావ‌ర‌ణం హైదరాబాద్‌లో ఉందని తెలిపారు.

CM Revanth Reddy: USISPF సమ్మిట్.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..
USISPF Summit 2025

ఢిల్లీ: హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రపంచ పెట్టుబడిదారులకు హైదరాబాద్‌ను ఉత్తమ గమ్యస్థానంగా మార్చుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ ఫోరం సదస్సు(USISPF)లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా USISPF వార్షిక సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆయన ప్రదర్శించారు.


గ‌త 23 నెల‌ల కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, పరిశ్రమలకు అనువైన వాతావ‌ర‌ణం హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్.. ప్రపంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు ఉత్తమ గమ్యస్థాన‌మ‌ని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువ‌త‌, వేగవంత‌మైన వృద్ధి రేటుతో తెలంగాణ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ‌త 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తోపాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సార‌థ్యం వ‌హించినా పెట్టుబ‌డుల‌ు, పెట్టుబ‌డిదారుల‌కు అంద‌రూ మద్దతుగా నిలిచార‌ని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ ముఖ్య ద్వార‌మ‌ని సీఎం కొనియాడారు.


జీసీసీల‌కు గమ్యస్థానంగా ఉన్న భాగ్యనగరంలో పెట్టుబ‌డుల‌కు ముందుకు రావాల‌ని పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మ‌హిళా సాధికారిత‌, నాణ్యమైన విద్య, యువ‌త‌కు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితోపాటు మెరుగైన వ‌స‌తులు, అత్యునత జీవ‌న ప్రమాణాలతో కూడిన అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిల‌ప‌డ‌మే త‌న ప్రథమ ప్రాధాన్యతమని ఆయన వెల్లడించారు. అద్భుత‌మైన మౌలిక వ‌స‌తులతో 30 వేల ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశంలోనే నూత‌న న‌గ‌రంగా మారుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


మూసీ న‌దీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరిగానే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుంద‌ని సీఎం తెలిపారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగ‌తిని వారికి వివరించారు. చైనా+1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి వివరించిన తెలంగాణ రైజింగ్-2047 విజ‌న్‌పై టెక్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

TGTET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

Nagarjuna withdrawn Defamation Case: మంత్రి కొండా సురేఖపై కేసును విత్ డ్రా చేసుకున్న నాగార్జున

Updated Date - Nov 13 , 2025 | 06:50 PM