City Dwellers: హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:12 PM
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీకెండ్, రాఖీ పౌర్ణమితో సొంతూళ్లకు నగరవాసుల పయనం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఉప్పల్-వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్, ఆగష్టు 9: హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. పలు రహదారుల్లో కిలోమీటర్ కదిలేందుకు గంటకుపైగా సమయం పడుతోంది. మరోవైపు హైదరాబాద్-విజయవాడ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వీకెండ్, రాఖీ పౌర్ణమి కావడంతో వేల మంది హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఉప్పల్-వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో హైవేపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.
అటు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పెద్దఎత్తున ప్రయాణీకులు బస్సులు, రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. పిల్లాపాపలతో పండుగ జరుపుకునేందుకు భారీగా జనం తమ సొంత ఊళ్లకు ప్రయాణమవుతున్న దృశ్యాలు దాదాపు నగరమంతా కనిపిస్తున్నాయి.

అటు, హైదరాబాద్ సిటీలోని దాదాపు అన్ని బస్టాండ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. రాఖీ పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లే మహిళలు, పిల్లలతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. బస్సులు ఆలస్యంగా రావడం, స్పెషల్ బస్సుల్లో 30 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేబీఎస్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, ఉప్పల్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణీకులు కిక్కిరిసిపోతున్నారు.