Share News

Mahalakshmi Scheme: మహాలక్ష్మీ.. మరో మైలు రాయి

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:07 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహలక్ష్మీ పథకం మరో రికార్డును సృష్టించింది. ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవటంతో ఈ 18 నెలల్లోనే తెలంగాణ ఆడబిడ్డలు రికార్డు స్థాయిలో అంటే.. రూ.6, 671 కోట్లు మేర ఆదా చేసుకున్నారు. ఈ పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు.

Mahalakshmi Scheme: మహాలక్ష్మీ.. మరో మైలు రాయి
Mahalakshmi Scheme In Telangana

హైదరాబాద్, జులై 22: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మి పథకంలో భాగంగా నేటి వరకు అంటే.. మంగళవారం వరకు 199.60 కోట్ల జీరో టికెట్లు జారీ చేశారు. రేపటితో అంటే.. జులై 23వ తేదీతో 200 కోట్లకు ఈ జీరో టికెట్ల జారీ చేరనుంది. దీంతో ఏడాదిన్నర రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో మహిళల సంక్షేమంతోపాటు వారి సాధికారతకు పెద్ద పీట వేసినట్లు అయింది. ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీని ఈ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంది.


తద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు అయింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరిన జస్ట్ 48 గంటల్లోనే అంటే.. డిసెంబర్ 9వ తేదీన ఈ మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం దేశప్రజలందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.


ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవటంతో ఈ 18 నెలల్లోనే తెలంగాణ ఆడబిడ్డలు రికార్డు మొత్తంలో అంటే.. రూ.6,671 కోట్లు ఆదా చేసుకున్నారు. ఈ పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజూకు పెరిగింది. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో సుమారు 8 లక్షల మంది మహిళలు రోజూ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.


2023 ఏడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మీ పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ అలాగే పలు పథకాలను సైతం అమలు చేస్తామని ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే రేవంత్ రెడ్డి మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు. పథకం అమలు కారణంగా.. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో రోజుకు లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో జులై 23వ తేదీ నాటికి 200 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు అవుతుంది.

ఇవీ చదవండి:

ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..

నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 05:47 PM