AIMIM : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి AIMIM మద్దతు: అసదుద్దీన్
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:06 AM
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి AIMIM మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని..
హైదరాబాద్, సెప్టెంబర్ 7 : రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తనను కోరారని ఒవైసీ చెప్పారు. ఈ మేరకు తమ పార్టీ హైదరాబాదీ, గౌరవనీయ న్యాయనిపుణులు అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని ఆయన తన ఎక్స్ సందేశంలో వెల్లడించారు. అంతేకాదు, తాను జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కూడా మాట్లాడి ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేశానని అసద్ తెలిపారు.
ఇండియా కూటమి పక్షాలన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), సమాజ్‌వాదీ పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), శివసేన (యుబిటి), ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎన్నికలలో జస్టిస్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాయి. 2007లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందే ముందు గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి జూలై 2011లో పదవీ విరమణ చేశారు. ఆయన 1990లో ఆరు నెలలు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. మే 2, 1995న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇలా ఉండగా, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు NDA తన అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ ను నిలిపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ఈ ఎన్నిక జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి
కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా