Share News

Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్

ABN , Publish Date - Nov 07 , 2025 | 07:17 AM

హైదరాబాద్‌లో 4 రోజుల పాటు వైన్స్‌ బంద్‌ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 12 సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులను నిర్వాహకులు మూసివేయనున్నారు.

Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
Jubilee Hills by-election

హైదరాబాద్, నవంబర్ 7: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో 4 రోజుల పాటు వైన్స్‌ బంద్‌ కానున్నాయి. నవంబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 12 సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు మూసివేయనున్నారు. ఓట్ల లెక్కింపు రోజు నవంబర్ 14న ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు, అవసరమైతే రిపోల్ రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 ప్రకారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు.


సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అన్ని వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు సహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు, స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లు మూసివేయనున్నారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 135-C ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయని కమిషనర్ తెలిపారు.


నవంబర్‌ 11న పోలింగ్‌ జరుగనున్న ఈ బైపోల్ లో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. అయితే ఈసారి ఇంత మంది ఎన్నికల్లో పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఇటీవల ఆయన హఠాన్మరణంతో ఈ ఉపఎన్నిక జరుగుతోంది.


ఈ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఎన్నికల బరిలో నిలువగా.. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య, మాగంటి సునీత పోటీ చేయనున్నారు. బీజేపీ పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి తమ సత్తా నిరూపించుకోవాలని చూస్తోంది. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బీఆర్ఎస్ యోచిస్తోంది. అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ, ఈ స్థానంలో గెలిచి పార్టీ బలం మరింత పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. ముగ్గురు అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి:

మరో డిప్యూటీ సీఎం

జూబ్లీహిల్స్‌ ఫలితం.. ప్రభుత్వంపై రెఫరెండమే

Updated Date - Nov 07 , 2025 | 10:35 AM