Hyderabad: 20 ఏళ్ల కుర్రోడికి.. 60 లక్షల ప్యాకేజీ!
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:09 AM
ఆ అబ్బాయికి నెలకు రూ.2 లక్షల ఉపకారవేతనం, అదనంగా రూ.60 లక్షల వేతన ప్యాకేజీ కూడా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంల్)తో బీటెక్ చివరి సంవత్సరం చదువువుతున్న 20 ఏళ్ల విద్యార్థికి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ఇది!
జేఎన్‌టీయూలో బీటెక్ (ఏఐఎంల్) ఫైనల్ చదువుతున్న షేక్ సోహెల్‌కు బంపర్ ఆఫర్
హైదరాబాద్ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆ అబ్బాయికి నెలకు రూ.2 లక్షల ఉపకారవేతనం, అదనంగా రూ.60 లక్షల వేతన ప్యాకేజీ కూడా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంల్)తో బీటెక్ చివరి సంవత్సరం చదువువుతున్న 20 ఏళ్ల విద్యార్థికి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ఇది! నగరంలోని జేఎన్‌టీయూలో చదువుతున్న షేక్ సోహెల్ అనే విద్యార్థిదీ అదృష్టం. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ అండ్ ఫైనాన్షియల్ ట్రేడింగ్ కంపెనీ ‘డీఈ షా’ ఆఫర్ చేసిన ఒకే ఒక్క ఉద్యోగానికి కంప్యూటర్ సైన్స్, ఏఐఎంల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాల నుంచి మొత్తంగా 200 మంది విద్యార్థులు పోటీపడ్డారు. వివిధ దశల్లో వడపోతల అనంతరం ఫైనల్ ఇంటర్వ్యూలో సోహెల్ టాపర్‌గా నిలిచారు.
ఎంత పరిజ్ఞానం ఉందనే విషయం కన్నా.. ఇచ్చిన సమస్యను తాను పరిష్కరించిన తీరు డీఈ షా కంపెనీ ప్రతినిధులను ఆకట్టుకుందని సోహెల్ చెప్పారు. ఇచ్చిన 30 నిమిషాల గడువులోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నానని వివరించారు. ఉన్నత చదువుతో చక్కని ఉద్యోగం సాధించాలనే తన కల దిశగా రెక్కలు ఇచ్చి.. ఎగిరేలా స్ఫూర్తినిచ్చింది హైదరాబాదేనని సోహెల్ చెప్పారు. తమ స్వస్థలం ఖమ్మం జిల్లా అని, తాను తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. తండ్రి బడేమియా ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లి చాన్‌బాను అన్నీతానై చూసుకుందని.. తన ఈ విజయంలో ఆమె మద్దతు ఎంతో ఉందని వివరించారు.