Share News

Hyderabad Metro Rail: సర్కార్‌ చేతికి మెట్రో

ABN , Publish Date - Sep 26 , 2025 | 06:01 AM

హైదరాబాద్‌ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ, మూడో దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.

Hyderabad Metro Rail: సర్కార్‌ చేతికి మెట్రో

  • ఇక మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానిదే..

  • 13 వేల కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం.. కంపెనీ వాటా కింద ఎల్‌ అండ్‌ టీకి 2 వేల కోట్లు

  • కంపెనీ ప్రతినిధులతో చర్చలు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం

  • రెండో దశ మెట్రోకు మార్గం సుగమం.. హైదరాబాద్‌ నగర చరిత్రలో మరో అధ్యాయం

  • ఎల్‌ అండ్‌ టీతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితేనే రెండో దశకు అనుమతిస్తామని కేంద్రం షరతు

  • ప్రతిష్ఠంభన తొలగించేందుకు చొరవ చూపిన సీఎం.. చర్చలకు వచ్చిన ఎల్‌ అండ్‌ టీ సీఎండీ

  • రెండో దశలోనూ భాగస్వామి కావాలన్న సీఎం.. రవాణా వ్యాపారం వదులుకున్నామన్న సీఎండీ

  • కావాలంటే మొదటి దశ ఇచ్చేస్తామని ఆఫర్‌.. స్వీకరించేందుకు సరేనన్న రాష్ట్ర ప్రభుత్వం

  • మెట్రో చేతిలో 260 ఎకరాలు.. ప్రభుత్వమే అమ్ముకోవచ్చు.. అప్పు భారం కాదని అధికార్ల అంచనా

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ, మూడో దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు, మూడు దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని ఎల్‌ అండ్‌ టీ సంస్థను సాగనంపి, తొలిదశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో దేశంలోనే తొలి ప్రైవేటు మెట్రో.. ప్రభుత్వపరం అవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మెట్రో మొదటి దశ కింద ఉన్న రూ.13 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ స్పెషల్‌ పర్సస్‌ వెహికిల్‌లో ఎల్‌ అండ్‌ టీ భాగమైన రూ.5,900 కోట్ల మొత్తంలో రూ.2000 కోట్లు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద చెల్లించేందుకు సమ్మతి తెలిపారు.


ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలిదశ నిర్వహణ ప్రభుత్వం చేతికి వస్తుంది. రెండోదశ పనులకు మార్గం సుగమం అవుతుంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ పొడవులో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ నేడు తొమ్మిదో స్థానానికి దిగజారింది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోదశ కింద 2ఏ, 2బి పేరుతో 8 మార్గాలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 163 కిలోమీటర్ల అదనపు మెట్రో నెట్‌వర్క్‌ ఏర్పాటుపై కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండో దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుండగా, మొదటి దశను ఎల్‌ అండ్‌ టీ నిర్మించి నిర్వహిస్తోంది. రెండు దశల ప్రాజెక్టుల సమన్వయం కోసం ఎల్‌ అండ్‌ టీతో రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి పని చేయడం మీద పక్కా విధివిధానాలతో ఒక ఒప్పందం(డెఫినిటివ్‌ అగ్రిమెంట్‌) ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో దశ పనుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటుచేసే జాయింట్‌ వెంచర్‌లో భాగస్వామి కావాలని కూడా ఎల్‌ అండ్‌ టీని కేంద్రం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండోదశ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండలేమని ఎల్‌ అండ్‌ టీ స్పష్టం చేసింది. డెఫినిటివ్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయలేమని తేల్చిచెప్పింది. ఎల్‌టీ-ఎంఆర్‌హెచ్‌-ఎల్‌లో ఉన్న తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటానంటే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.


రెండో దశలో ఉంటే బాగుండేది

ఈ పరిణామాల నేపథ్యంలో మెట్రో రైలు విస్తరణపై గత ఏడాది నవంబరు నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి ఎల్‌ అండ్‌ టీ సంస్థ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌తో గురువారం భేటీ అయ్యారు. రెండో దశలో కూడా ఎల్‌ అండ్‌ టీ భాగస్వామిగా కొనసాగితే బాగుంటుందని ముఖ్యమంత్రి సూచించారు. ఈ తరహా వ్యాపారాల నుంచి ఎల్‌ అండ్‌ టీ తప్పుకుందని, అందువల్ల రెండో దశ మెట్రో పనుల్లో భాగస్వామిగా ఉండలేమని సుబ్రహ్మణ్యన్‌ స్పష్టం చేశారు. అయితే, రెండో దశను తాము నిర్మించుకుంటామని, రెండు దశల మధ్య సమన్వయం కోసం డెఫినిటివ్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ఒప్పందంలో ఆదాయం, ఖర్చులను పంచుకోవాలనే అంశాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వ సూచనలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆదాయం పెరగకపోవడం, నిర్వహణభారం పెరగడంపై ఇప్పటికే ఆందోళనతో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో దశతో కలిసి నడిచే ఒప్పందంపై సంతకం చేయడానికి తాము సిద్ధంగా లేమని ఎల్‌ అండ్‌ టీ సీఎండీ తేల్చిచెప్పారు. ఇదే తరుణంలో తొలిదశలో తమకున్న 90 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి గుర్తు చేశారు. దీంతో తొలి దశ ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత తెలిపింది. ఈ సందర్భంగా తొలిదశ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చించారు. రూ.13 వేల కోట్ల అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, తమ వాటా కింద రూ.5,900 కోట్లు చెల్లించాలని సుబ్రహ్మణ్యన్‌ కోరారు. గత ప్రభుత్వ హయాంలో 2022 జూలై 22న కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.3000 కోట్లు చెల్లించాలని, అందులో ఇంకా రూ.2,100 కోట్లు ఎల్‌ అండ్‌ టీకి చెల్లించలేదని గుర్తు చేశారు.


ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి

మెట్రో రైల్‌ నుంచి ఎల్‌ అండ్‌ టీ అవుట్‌ అని ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. వెళ్లిపోతామంటే ప్రభుత్వమే తీసుకునే యోచనలో ఉందని తెలుపుతూ ఈ నెల 18న ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. ఎల్‌ అండ్‌ టీతో చర్చల అనంతరం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రజ్యోతి కథనం అక్షర సత్యమని స్పష్టమైంది.

రూ.2 వేల కోట్లతో డీల్‌

రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు పొందడం కోసం మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ ప్రాజెక్టు అప్పు 13 వేల కోట్లు తన మీద వేసుకొని, ఎల్‌ అండ్‌ టీ ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తంలో 2,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. త్వరలోనే చట్టపరమైన ఒప్పందం ద్వారా మెట్రో నిర్వహణ ప్రభుత్వ పరిధిలోకి రానుంది. ఇందుకు సంబంధించి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఎల్‌ అండ్‌ టీ ఒప్పందాలపై న్యాయపరమైన చిక్కులన్నీ తొలిగిన తరువాత ప్రభుత్వ నిర్వహణలోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, తొలిదశ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మెట్రో నిర్వహణ చేపట్టిన సంస్థకు 260 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని లీజు ప్రాతిపదికన వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా ఒప్పందం ఉంది. ప్రభుత్వమే మెట్రో నిర్వహణ చేపట్టే అవకాశం ఉన్నందున భూములను విక్రయించడం ద్వారా కూడా నిధులు సమకూర్చుకునేందుకు వెసులబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణలోకి వచ్చిన తరువాత మొదటి దశ నిర్వహణ బాధ్యతలను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహిస్తుందా? లేక మరేదైనా సంస్థతో ఒప్పందం చేసుకుంటుందా? అనే అంశంపైనా అధికారుల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - Sep 26 , 2025 | 06:29 AM