Share News

Hyderabad Metro: వినూత్నంగా మెట్రో రెండో దశ

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:55 AM

రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ నిర్మాణాన్ని వినూత్నంగా చేపట్టనుంది. విదేశాల్లోని సాంకేతికతను వినియోగించి నూతన తరహాలో కారిడార్లను పూర్తి

Hyderabad Metro: వినూత్నంగా మెట్రో రెండో దశ

యూ-గిడ్డర్‌ విధానంలో ట్రాక్‌ నిర్మాణం.. రెండు పిల్లర్ల మధ్య పొడవాటి స్పాన్‌ ఏర్పాటు

  • డీపీఆర్‌లో పొందుపరిచిన హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు

  • ప్రీ కాస్టు యార్డు నుంచి నేరుగా తరలించేలా చర్యలు

  • తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ నిర్మాణాన్ని వినూత్నంగా చేపట్టనుంది. విదేశాల్లోని సాంకేతికతను వినియోగించి నూతన తరహాలో కారిడార్లను పూర్తి చేసేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్రానికి పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో వివిధ నిర్మాణ పద్ధతులను పొందుపరిచారు. ప్రధానంగా మెట్రో ట్రాక్‌ నిర్మాణాన్నియూ-గిడ్డర్‌ విధానంలో చేపట్టనున్నారు. మెట్రో మొదటి దశలో సెగ్మెంటల్‌ విధానంలో పిల్లర్లను నిర్మించగా.. ఈసారి ఈ కొత్త పద్ధతిని అనుసరించనున్నారు. ఇందులో రెండు పిల్లర్ల మధ్య ఒకే గిడ్డర్‌ పెడుతున్నారు. ఇది 20-35 మీటర్ల వరకు ఉంటుంది. వాస్తవంగా యూ-గిడ్డర్‌ అనేది ఎలివేటెడ్‌ మెట్రో రైలు వయాడక్ట్‌ల నిర్మాణంలో ఉపయోగించే నిర్దిష్టమైన ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ బీమ్‌. దీనిని ’యూ’ ఆకారపు క్రాస్‌ సెక్షన్‌ ద్వారా తయారు చేస్తుంటారు. ఇలాంటి గిడ్డర్లు ట్రాక్‌లకు నిర్మాణాత్మకమైన బలాన్ని అందిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా, గతంలో బెంగళూరులో 31 మీటర్ల పొడవైన యూ-గిడ్డర్‌ను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం చెన్నై మెట్రో రైలు రెండో దశ నిర్మాణంలో 33.33 మీటర్లను చేపడుతున్నారు. ఇది దేశంలోనే అతి పొడవైన గిడ్డర్‌గా ఉంది. ఈ నిర్మాణం ద్వారా తక్కువ ఖర్చు అవుతుందని, హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో దీనిని ఉపయోగించాలని డీపీఆర్‌లో పొందుపరిచారు.


ప్రీకాస్టు యార్డులు ఇక్కడే..!

ఢిల్లీ నుంచి డీపీఆర్‌లకు ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు టెండర్లు పిలిచి నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రీకాస్టు యార్డు (పిల్లర్లు, వయాడక్టులు, గిడ్డర్ల తయారీ)లను మొదటి దశలో ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటు చేశారు. అయితే రెండో దశలో 8 కారిడార్లకు మెటీరియల్‌ పెద్ద ఎత్తున అవసరం ఉంది. దీంతో హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు మియాపూర్‌-పటాన్‌చెరు మార్గంలో 2, కోకాపేట్‌ వద్ద ఒకటి, ఎయిర్‌పోర్టు మార్గంలో 2, ఎల్‌బీనగర్‌ వద్ద ఒకటి చొప్పున యార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రెండో దశ విస్తరణలో భాగంగా స్టేషన్ల వద్ద ఓపెన్‌ పార్కింగ్‌ విధానం చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో పార్కింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా నగరంలో ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో అన్ని స్టేషన్ల వద్ద చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.


వేగంగా పనులు..

మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన 8 కారిడార్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ప్రతిపాదిత కారిడార్లకు కేంద్రం అనుమతి ఇచ్చేలోపు పాతబస్తీ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు వడివడిగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా 7.5 కిలోమీటర్ల కారిడార్‌ నిర్మాణానికి కావాల్సిన ఆస్తుల సేకరణను పూర్తి చేసి నిర్మాణాలను తొలగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 03:55 AM