Share News

Jishnu Dev Varma: భాగ్యనగరం.. సాహిత్యమయం

ABN , Publish Date - Jan 20 , 2025 | 03:42 AM

శాస్త్ర, సాంకేతిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల మేలు కలయికగా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ 3 రోజుల పాటు జరగనుంది. ఈనెల 24న సత్వా నాలెడ్జ్‌ సిటీలో ఈ సమావేశాలను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించనున్నారు.

Jishnu Dev Varma: భాగ్యనగరం.. సాహిత్యమయం

  • ఈ నెల 24నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్‌ సాహితీ మహోత్సవం

  • షబానా ఆజ్మీ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

  • చర్చాగోష్ఠుల్లో అమోల్‌ పాలేకర్‌, సిద్ధార్థ్‌, అరుణా రాయ్‌, హర్షమందిర్‌ తదితరులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి19(ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల మేలు కలయికగా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ 3 రోజుల పాటు జరగనుంది. ఈనెల 24న సత్వా నాలెడ్జ్‌ సిటీలో ఈ సమావేశాలను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించనున్నారు. సాహితీ సదస్సులు, కావ్యథార, ఫొటో, పెయింటింగ్స్‌ ఎగ్జిబిషన్స్‌, పుస్తక రచయితలతో సంభాషణ ఇలా 15రకాల విభాగాల్లో పలు రంగాలకు చెందిన 270మందికిపైగా ప్రముఖులు పాల్గొంటున్నారని ఫెస్ట్‌ డైరెక్టర్‌ కిన్నెర మూర్తి తెలిపారు. కాగా, నటి షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవ సంబురాలకు హైదరాబాద్‌ సాహితీ మహోత్సవం వేదిక కానుంది. ఈ నెల 24న ఉదయం షబానాతో చర్చాగోష్ఠి జరగనుంది. తర్వాతి రోజుల్లో ప్రముఖ సామాజికవేత్త అరుణారాయ్‌తో సంభాషణ, నటుడు సిద్ధార్థ్‌, పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ కీలకోపన్యాసం చేస్తారు. రాజ్యాంగ విలువలు అంశంపై ప్రముఖ గాంధేయవాది హర్షమందర్‌, బాపూజీ మనుమడు రాజమోహన్‌గాంధీ ప్రసంగించనున్నారు. వాతావరణ మార్పులపై సంభాషణ, అంతరించి పోతున్న భాషల పరిరక్షణ అంశాలపై ప్రత్యేక సదస్సులు జరగనున్నాయి. సీనియర్‌ శాస్త్రవేత్తలు సమావేశాల్లో పాల్గొంటారని ఫెస్టివల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ చెప్పారు.


లిథువేనియా ప్రతినిధి ప్రత్యేక ఆకర్షణ

ఈ ఏడాది లిథువేనియా దేశ సాహితీ వేత్తలు అతిథులుగా పాల్గొంటున్నారు. ఆ దేశ రాయబారి డయానా మికెవిసీన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సంస్కృతంపై పరిశోధనలు చేసిన డయానా ప్రధాన వక్తగా ‘లిథువేనియా - సంస్కృత’ భాష నిఘంటువుమీద ప్రత్యేక చర్చాగోష్ఠి జరగనుంది. అంతరించిపోతున్న భాషల పరిరక్షణమీద అజిత్‌ మొహంతీ, మహేంద్రకుమార్‌ మిశ్రా తదితర భాషావేత్తలతో సమావేశాలకు హెచ్‌ఎల్‌ఎఫ్‌ వేదిక కానుంది. ప్రముఖ మోడల్‌ హ్యూమా ఖురేషీ, ప్రఖ్యాత రచయిత్రి అనితా నాయర్‌, నటుడు అమోల్‌ పాలేకర్‌, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, సామాజికవేత్త సునీతా కృష్ణన్‌ తదితరులు కీలకోపన్యాసం చేయనున్నారు. సింధీ భాషా సంస్కృతులపై చర్చాగోష్ఠి జరగనుంది. సాంస్కృతిక కార్యక్రమాలు టీ హబ్‌ ప్రాంగణంలో, మిగతా చర్చాగోష్ఠులు, సదస్సులు సత్వా నాలెడ్జ్‌సిటీలో నిర్వహిస్తారు.

Updated Date - Jan 20 , 2025 | 03:42 AM