Share News

Hyderabad Industrial Land Transfer: ఏళ్ల కిందట కొన్నదీ మార్కెట్‌ ధరకే!

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:11 AM

హైదరాబాద్‌ పారిశ్రామిక భూమార్పిడి(హిల్ట్‌) విధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ఈ విధానంపై మాటల యుద్దానికి దిగాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి......

Hyderabad Industrial Land Transfer: ఏళ్ల కిందట కొన్నదీ మార్కెట్‌ ధరకే!

  • అభివృద్ధి చార్జీలు కలుపుకొంటే అంతకన్నా ఎక్కువే

  • 98ు భూములు.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవే

  • సొంత భూములపై మళ్లీ పన్నెందుకు కట్టాలి?

  • 30 శాతం కన్వర్షన్‌ ఫీజు కూడా మాకు భారమే

  • పరిశ్రమల తరలింపు ఖరీదైన వ్యవహారం

  • ఇక్కడి రియల్టీ లాభం.. అక్కడి ఖర్చుతో సరి

  • మూతబడ్డ పరిశ్రమల వారికే దీనివల్ల మేలు

  • పరిశ్రమల తరలింపు సమాజం అవసరం

  • భారం వేస్తుంది మాత్రం యజమానుల మీద

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పారిశ్రామిక భూమార్పిడి(హిల్ట్‌) విధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటు ప్రభుత్వం-అటు ప్రతిపక్షాలు ఈ విధానంపై మాటల యుద్దానికి దిగాయి. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ శివార్లలో స్థాపించిన ఈ పారిశ్రామిక వాడలు ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. వీటిని ఓఆర్‌ఆర్‌ బయటకు తరలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్తోంది. రెడ్‌, ఆరెంజ్‌ జోన్‌ పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలించాలని గతంలోనే హైకోర్టు చెప్పిందని, గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ మేరకు కసరత్తు జరిగిందని గుర్తు చేస్తోంది. నగర ప్రజలకు కాలుష్యం లేకుండా చేయడం, మరింత వాణిజ్యపర కార్యక్రమాలకు అవకాశం ఇవ్వడం, నిరుపయోగంగా ఉన్న భూములను ఉపయోగంలోకి తేవడం, ప్రభుత్వానికీ కొంత ఆదాయం సమకూర్చడం కోసం ఈ విధానం తెచ్చామని చెబతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలు మాత్రం ఇందులో లక్షల కోట్ల రూపాయల అవినీతి దాగుందని ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల కోసం భూములు కేటాయించేటప్పుడు తక్కువ ధరకే కేటాయించారని, జోన్‌ మార్పిడిలో కూడా రిజిస్ట్రేషన్‌ విలువలో 30 నుంచి 50 శాతం మాత్రమే వసూలు చేస్తూ మరింత లబ్ధి చేకూరుస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50, 60 ఏళ్ల క్రితం చిన్న, మధ్యతరగతి యూనిట్లు పెట్టుకుని, ఇప్పుడు హిల్ట్‌ పథకం కింద ఆ భూములను మార్చుకుంటున్న పారిశ్రామికవేత్తలు దీనిపై ఎలా స్పందిస్తున్నారన్నది కూడా ఆసక్తికరమే. నాచారం, ఉప్పల్‌, పటాన్‌చెరు పారిశ్రామిక వాడల్లోని చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను దీనిపై ప్రశ్నించగా అనేక కోణాలు బయటికొచ్చాయి.


న్యాయంగా అయితే పది లక్షలే!

అప్పుడే మార్కెట్‌ రేటుకు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు చేస్తున్నది జోన్‌ మార్పిడి. పదిశాతంతో అయిపోవాలి. హిల్ట్‌ పేరుతో 30-50 శాతం వేస్తున్నారు. న్యాయంగా అయితే ఇంతకన్నా తక్కువకే కావాలి. కన్వర్షన్‌ కూడా మాకు భారమే. మరోపక్క ప్రతిపక్షాలు 5 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నాయి. సాధారణంగా వ్యవసాయ భూములు, గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న భూములను నివాస ప్రాంతాలుగా మార్చుకోవాలంటే ఎకరానికి రూ.10,11,714 చెల్లించాలి. పారిశ్రామిక జోన్‌ నుంచి నివాస జోన్‌కు మార్చాలన్నా అంతే ధర ఉంది. దశాబ్దాల కిందట డబ్బులు పెట్టి కొని, ఇంతకాలం పరిశ్రమలు నడిపి, ఉపాధి అవకాశాలు కల్పించిన మాకు ఇప్పుడు గజాల చొప్పున లెక్కలేసి వాటి రిజిస్ట్రేషన్‌ విలువలో 30-50 శాతం కట్టాలంటున్నారు. ఆ లెక్కన నాచారంలో గజం రూ.21 వేలు ఉంది. 30 శాతం చొప్పున కట్టాలంటే ఎకరానికి 3 కోట్లు అవుతుంది. ఇదెక్కడి న్యాయం?’

- చర్లపల్లి, నాచారం పారిశ్రామికవేత్తలు


చిన్న పరిశ్రమలకైతే చాలా కష్టం

ఉన్నపళంగా మా పరిశ్రమలను తరలించమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. జోన్‌ మార్పిడి ద్వారా భూమి డెవల్‌పమెంట్‌కు ఇస్తే వచ్చే లాభం కన్నా పరిశ్రమను ఓఆర్‌ఆర్‌ బయట ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. చిన్న, సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు తరలింపు మరింత కష్టం.

- ఉప్పల్‌ పారిశ్రామికవాడ చైర్మన్‌ శివశంకర్‌

మూసేసిన పరిశ్రమలకు లాభం

కొత్త ప్రాంతానికి పరిశ్రమను తరలించినంత తేలికగా ఉద్యోగులను తరలించడం సాధ్యం కాదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగులు ప్రస్తుతమున్న కంపెనీ చుట్టుపక్కలే సొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, మారుమూల ప్రాంతాలకు మార్చితే అక్కడికి రారని అంటున్నారు. నిపుణులైన ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. భూములకు రియాల్టీ విలువ లభించడం మినహా తమకు ఎలాంటి లాభం లేదని అంటున్నారు. పరిశ్రమలు నడపలేక వదిలేసిన వారికి మాత్రం హిల్ట్‌ పాలసీ సువర్ణావకాశంగా మారింది. కాలం చెల్లిన పరిశ్రమలను మూసేసి, అమ్ముకుందామంటే మంచి ధర దొరక్క వీరంతా నైరాశ్యంలో ఉన్నారు. వాళ్లకు హిల్ట్‌ పాలసీ మంచి అవకాశం. ఈ భూముల్లో వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నివాస అపార్ట్‌మెంట్లు నిర్మించి సొమ్ము చేసుకోవాలని వీరు భావిస్తున్నారు. పరిశ్రమల తరలింపును పరిసర ప్రాంతాల వారు స్వాగతిస్తున్నారు. కొత్త కొత్త మార్కెట్లు, వ్యాపార సముదాయాలు, సంతల ఏర్పాటుతో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఉపయోగంలో లేని భూములను అందరికీ లబ్ధి చేకూరే మార్చడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం కూడా చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, ముఖ్యమంత్రికి సంబంధించిన వారు బేరసారాలు జరిపారని, ఒప్పందాలు కుదిరాకే హిల్ట్‌ పాలసీ బయటకు వచ్చిందని అంటున్నారు. తమ వద్దకు ఎవరూ రాలేదని, ఏ బేరసారాలు జరగలేదని, తమ సొంత భూముల గురించి మరెవరితోనో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన ఖర్మ తమకేమిటని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు.


ఎంత మంది హిల్ట్‌ను వాడుకుంటారు?

22 పారిశ్రామిక వాడల్లో హిల్ట్‌ పాలసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు. జోన్‌ కన్వర్షన్‌ చేసుకుని ఓఆర్‌ఆర్‌ బయటకు వెళ్లేందుకు ఎంతమంది సిద్ధమనేది తేలాల్సి ఉంది. పెద్ద రోడ్ల పక్కన స్థలాలున్న వారు కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల వైపు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు జోన్‌ మార్పిడి ఫీజును చెల్లించే పరిస్థితుల్లో కూడా లేరు. చిన్నరోడ్ల వెంబడి స్థలాలున్న వారు, పరిశ్రమే తమ ఉపాధిగా జీవిస్తున్న వారు అంత సుముఖంగా లేరు. అయితే, చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం పేరుతో తమపై చీటికీ మాటికీ కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదులిస్తూ బెదిరిస్తున్నారని కొందరు వాపోయారు. ఇదంతా భరించలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నగరం వెలుపలికి పోవాలని యోచిస్తున్నారు. మరికొందరు అక్కడకు చిరుద్యోగులు రారని భయపడుతున్నారు. నగరంలో ఒక యూనిట్‌ బయట ఒక యూనిట్‌ ఉన్నవారికి తేలిక అవుతుంది. ఈ భూమిని వాణిజ్యపరంగా వాడుకొని, ఓఆర్‌ఆర్‌ అవతల ఉన్న యూనిట్‌ను విస్తరించవచ్చు. విస్తరణకు ప్రభుత్వం కూడా అవకాశం కల్పించింది. అయితే, ఇక్కడ జోన్‌ కన్వర్షన్‌ చేసుకుని, వాణిజ్య భవనాలు కట్టుకుని, నగరం బయట పరిశ్రమలు పెట్టకుండా ఉంటే ఆ మేరకు ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయనే చర్చ కూడా నడుస్తోంది.


70 వేల మంది ఉపాధి సమస్య

నాచారం పారిశ్రామిక వాడ 700 ఎకరాల్లో ఉంది. ప్లాటెడ్‌ ఏరియా 455 ఎకరాలు. అందులో 800 దాకా పరిశ్రమలు ఉన్నాయి. 70 శాతం ఎస్టేట్‌ ప్రారంభమయిన రోజుల్లోనే కొన్నారు. మిగతా వారు దఫాలుగా కొని పరిశ్రమలు పెట్టారు. ఈ కంపెనీల్లో రెండు షిఫ్టులకు కలిపి 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఖాయిలాలు పడిన కంపెనీలు విస్తీర్ణపరంగా 30 శాతం వరకు ఉంటాయి. రెడ్‌ జోన్‌లో 30 శాతం, 40 శాతం ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లో ఉంటాయి. వీటన్నింటినీ తరలిస్తే వేల మంది ఉపాధి కోల్పోతారు. భూ వినియోగ మార్పిడికి అనుమతి ఇస్తే ప్రజలకు ఉపాధి కల్పించే కొత్త వ్యాపారాల్ని ప్రారంభిస్తామని యజమానులు చెబుతున్నారు. హిల్ట్‌ విధానంలో ఉపాధి కల్పన గురించి కొత్త విది విధానాలు చేరిస్తే ఆలోచిస్తామంటున్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడ 762 ఎకరాల్లో ఉంది. ప్లాటెడ్‌ ఏరియా 495 ఎకరాలుగా ఉంది. 985 వరకు పరిశ్రమలు ఉన్నాయి. 1975లో ఎకరా రూ.35,000కు కొన్నామని, అప్పటి స్థానిక ధరకు రెండు రెట్లని చర్లపల్లి పారిశ్రామిక వాడ మాజీ చైర్మన్‌ రోసిరెడ్డి తెలిపారు. 40-50 వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. హిల్ట్‌ పాలసీలో 5 శాతం కంటే తక్కువ మందే దరఖాస్తు చేసుకుంటారని, ఇక్కడడ రియాల్టీ డిమాండ్‌ అంతగా లేదని చెప్పారు. రెడ్‌ జోన్‌లో పరిశ్రమలు కూడా 2 శాతానికి మించి లేవని, ఖాయిలా పరిశ్రమలు కూడా 5 శాతమేనని చెప్పారు.

మరికొంత సమయం కావాలి

భూమార్పుకు ఆరు నెలల సమయం సరిపోదని, ఇంకాస్త సమయం ఇస్తే బాగుంటుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఫీజు చెల్లింపునకు 45 రోజులు గడువు ఇచ్చారని, దాన్ని మూడు నెలలకు పొడిగించాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ వెలుపలికి వెళ్లాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తే ఏం చేస్తారని అడగ్గా, బీహెచ్‌ఈఎల్‌, మిథానీ, బీఈల్‌, హాల్‌, డీఆర్‌డీఓల నుంచి కాలుష్యం రావడం లేదా? మరి వాటిని కూడా ఓఆర్‌ఆర్‌ బయటికి తరిమేస్తారా అని ప్రశ్నించారు.


మూడు రెట్ల ధర తీసుకున్నారు

ఎప్పుడో 60 ఏళ్ల క్రితం మా నాచారం పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. అప్పట్లో ఎకరం రూ.15 వేలు చొప్పున కొన్నాం. 90 శాతం రైతుల నుంచే సేకరించి ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా మూడు రెట్లు ఎక్కువ పెట్టి మేం కొనుగోలు చేశాం. నాడు మేం చెల్లించిన అభివృద్ధి చార్జీలు కలిపితే అప్పటి బహిరంగ మార్కెట్‌ కన్నా ఎక్కువే పడింది. మాకు తక్కువకే ఇచ్చారని, తక్కువకే జోన్‌ మార్పిడి చేసేస్తున్నారని అనడం సరికాదు. జోన్‌ కన్వర్షన్‌ వల్ల వచ్చే దానికంటే మా పరిశ్రమను ఓఆర్‌ఆర్‌ అవతలకు తరలించడానికయ్యే ఖర్చే ఎక్కువ. పరిశ్రమలు పెట్టి, మేం బాగుపడటంతో పాటు పది మందికి ఉపాధి కల్పించవచ్చన్న లక్ష్యంతోపనిచేశాం. నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, చర్లపల్లి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో 98 శాతం భూములు నాడే కొని, రిజిస్టర్‌ చేయించుకున్నాం. సొంత భూములకు జోన్‌ మార్పిడి పేరుతో 30-50 శాతం ఫీజు వసూలు కూడా సరికాదు. పరిశ్రమలను తరలించాలని అడుగుతున్నదే ప్రభుత్వం. రాష్ట్రంలో అనేకచోట్ల జోన్‌ కన్వర్షన్లకు వేస్తున్న చార్జీలు చాలా తక్కువ. మాకే భారీగా వేశారు.

- నాచారం పారిశ్రామిక వాడ చైర్మన్‌ మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకన్న, కార్యదర్శి బాలరాజు

Updated Date - Dec 13 , 2025 | 06:11 AM