High Court: డిప్లొమోను ఇంటర్‌తో సమానంగా పరిగణించాలి: హైకోర్టు
ABN , Publish Date - Jul 06 , 2025 | 05:20 AM
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పాలిటెక్నిక్) డిప్లొమో కోర్సు ఇంటర్మీడియట్‌తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పాలిటెక్నిక్) డిప్లొమో కోర్సు ఇంటర్మీడియట్‌తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులను ఇంటర్ అర్హతగా నిర్ణయించిన కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని ఆదేశించింది. ఇంటర్ అర్హతగా ఉన్న ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమో కోర్సు (డీఈఈసెట్-2025) చేసేందుకు అనుమతించడం లేదంటూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన హరీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2001లో జారీచేసిన జీవో 112 ప్రకారం పాలిటెక్నిక్ డిప్లొమోను ఇంటర్‌కు సమానంగా గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఏకీభవించిన హైకోర్టు ఆయనను కౌన్సెలింగ్‌కు అనుమతించి, అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది.
పట్టాభూముల్లో కాల్వలు నిర్మిస్తే పరిహారమివ్వాలి
హైకోర్టు స్పష్టీకరణ
ప్రైవేటు పట్టా భూముల్లో ప్రధాన, పిల్ల కాలువలు నిర్మించాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం నిర్దేశిస్తున్న నిబంధనలను అనుసరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. భూసేకరణ చేపట్టి, రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేసుకోవాలని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామ పరిధిలో చేపడుతున్న కాలువల పనులకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల భూముల్లో కాలువలు నిర్మించాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టి పరిహారం ఇవ్వాలని పేర్కొంది.