Hyderabad: హైడ్రాను అభినందించిన హైకోర్టు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:59 AM
పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పర్యావరణహితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు గురువారం అభినందించింది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించే విషయంలో హైడ్రా అవసరముందంటూ జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్డు ఆక్రమణపై రాంనగర్ మణెమ్మ వీధి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ గతంలో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసింది. జీహెచ్‌ఎంసీ ..హైడ్రా సహకారాన్ని కోరడంతో జమిస్తాన్‌పూర్ రాంనగర్ క్రాస్‌రోడ్ వద్ద రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని తొలగించింది.
దీంతో రాంనగర్ ప్రధాన రహదారికి వెళ్లేందుకు ఆటంకం తొలిగిపోయింది. దీనిపై ఆ వాణిజ్య సముదాయం నిర్మాణదారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగానే రహదారులపై ఆక్రమణలు తొలగించే విషయంలో హైడ్రా సేవలు అవసరమని ధర్మాసనం పేర్కొంది. ప్రజాప్రయోజనాలకు లోబడే ప్రైవేటు ప్రయోజనాలు ఉండాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.