High Court: ట్రాఫిక్‌ను గాలికి వదిలేసి చలానాలపై దృష్టా?
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:51 AM
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారని, చలాన్లు విధించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారని, చలాన్లు విధించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయాందోళనకు గురిచేసే విధంగా వేల రూపాయలను జరిమానాగా విధిస్తున్నారని వ్యాఖ్యానించింది. చట్టంలో పేర్కొన్న విధంగా కాకుండా అక్రమంగా అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988లో పేర్కొన్న విధంగా రూ.100 నుంచి రూ.300 విధించాల్సిన తప్పునకు రూ.1200 చలానా విధించారని, ఇది అక్రమమని పేర్కొంటూ తార్నాకకు చెందిన వి.రాఘవేంద్రచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం..చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా ఎందుకు జరిమానా విధించారో వివరణ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఇందుకు వారం రోజు సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది.