Share News

CM Revanth Reddy Highlighted Hyderabad Growth: హైదరాబాద్‌..ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:58 AM

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రంగాల్లో ఎగుమతులు గత ఏడాది రెట్టింపయ్యాయని...

CM Revanth Reddy Highlighted Hyderabad Growth: హైదరాబాద్‌..ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌

  • ఈ రంగాల్లో గత ఏడాది రెట్టింపైన ఎగుమతులు

  • సఫ్రాన్‌ ఏర్పాటు తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయి.. వెయ్యి మంది నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి

  • ఎంఎ్‌సఎంఈలకు దక్కనున్న వ్యాపారావకాశాలు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • జీఎంఆర్‌ ఏరోపార్క్‌లో సఫ్రాన్‌ సంస్థ ఎంఆర్‌వో సెంటర్‌.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

  • బెంగళూరు-హైదరాబాద్‌ను డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానికి రేవంత్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ రంగాల్లో ఎగుమతులు గత ఏడాది రెట్టింపయ్యాయని, 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ.. ఏరోస్పేస్‌ అవార్డును పొందిందన్నారు. బుధవారం శంషాబాద్‌ సమీపంలోని జీఎంఆర్‌ ఏరో పార్క్‌ (సెజ్‌)లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్‌ నెలకొల్పుతున్న లీప్‌ ఇంజన్‌ ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌) సెంటర్‌ను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సఫ్రాన్‌కు అభినందనలు తెలిపారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్‌, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది భారతదేశంలో లీప్‌ ఇంజన్ల మొట్టమొదటి ఎంఆర్‌వో సెంటర్‌ అని చెప్పారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వెయ్యి మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి కల్పిస్తుందన్నారు. స్థానిక ఎంఎ్‌సఎంఈలకు, ఇంజనీరింగ్‌ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. దాంతోపాటు సఫ్రాన్‌కు చెందిన ఎమ్‌88 మిలిటరీ ఇంజిన్‌ ఎంఆర్‌వోకు కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఈ ఎంఆర్‌వో భారత వైమానిక దళం, భారత నావికా దళానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.


రాష్ట్రంలో ప్రపంచ ప్రధాన కంపెనీలు..

తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500కు పైగా ఎంఎ్‌సఎంఈలు ఉన్నాయని సీఎం రేవంత్‌ అన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎంఎ్‌సఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్‌ పార్కులు, సెజ్‌లు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయన్నారు. సఫ్రాన్‌, బోయింగ్‌, ఎయిర్‌ బస్‌, టాటా, భారత్‌ ఫోర్జ్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని వివరించారు. దేశంలోని ప్రముఖ ఎంఆర్‌వో, ఏరో ఇంజిన్‌ హబ్‌లలో హైదరాబాద్‌ ఒకటని సీఎం చెప్పారు.. ఏరోస్పేస్‌ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమన్నారు. టాటా టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో తెలంగాణ 100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేసిందని తెలిపారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతోందన్నారు. 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు.

గ్లోబల్‌ సమ్మిట్‌కు అందరికీ ఆహ్వానం..

తమ విజన్‌ను ఆవిష్కరించడానికి డిసెంబరు 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్‌ తెలిపారు. 2035 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బెంగళూరు-హైదరాబాద్‌ను డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. సఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్‌ క్రాఫ్ట్‌ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. దాంతో రాబోవు రోజుల్లో 15 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల వరకు విదేశీ మారక నిల్వలు పెంచుకోవచ్చని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్‌ రంగంలో దేశీయ సామర్థ్యాలకు సఫ్రాన్‌ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వనుందన్నారు. భారత మార్కెట్‌లో ఎంఆర్‌వో మార్కెట్‌ 2031 నాటికి 4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు. 8.9 శాతం వృద్ధిని నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, సఫ్రాన్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 07:21 AM