Sajjanar: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు?: సజ్జనార్
ABN , Publish Date - Oct 26 , 2025 | 07:59 PM
కర్నూలు బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాగి వాహనాలు నడిపేవారు ఉగ్రవాదులని.. వారి చర్యలు వలన జరిగే రోడ్డు ప్రమాదాలు ఉగ్రవాద చర్యలకు తక్కువ కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 26: కర్నూలు బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాగి వాహనాలు నడిపేవారు ఉగ్రవాదులని.. వారి చర్యలు వలన జరిగే రోడ్డు ప్రమాదాలు ఉగ్రవాద చర్యలకు తక్కువ కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. కర్నూలు బస్సు ప్రమాదం 20 మంది అమాయకుల ప్రాణాలను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న బైకర్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. నిర్లక్ష్యపు నేరపూరిత చర్య అని పేర్కొన్నారు.
ఈ ఘోర బస్సు ప్రమాదం కొన్ని సెకన్లలోనే మొత్తం కుటుంబాలను నాశనం చేసిందని తెలిపారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసేవాళ్లు మానవ బాంబులు అని ఘాటుగా స్పందించారు. బైకర్ బి. శివ శంకర్ మద్యం మత్తులో ఉండి ప్రమాదానికి కారణం అయ్యాడని చెప్పారు. ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు.
మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీరి కదలికలపై వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని అన్నారు. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని 'X'లో తన ఆవేదనను పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
Congress Ministers: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్‌ను గెలిపించాలి: మంత్రులు