Congress Ministers: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్‌ను గెలిపించాలి: మంత్రులు
ABN , Publish Date - Oct 26 , 2025 | 07:34 PM
జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని తుమ్మల పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 26: రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఒక మినీ ఇండియాగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి అద్భుతమైన దార్శనికతతో పనిచేస్తున్నారని కొనియాడారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా వెంగళరావునగర్ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ నాయకత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఆయన గెలుపుతో జూబ్లీహిల్స్ అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు.
జూబ్లీహిల్స్ జరగబోయే ఉపఎన్నికతో బీఆర్ఎస్ కథకు చరమగీతం పాడబోతున్నామని తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చారిత్రక తీర్పు ఇచ్చి, బీఆర్ఎస్‌ను రాజకీయంగా సమాధి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన అంటేనే అవినీతి, అణచివేత అని విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వతంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ను పూర్తిగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు సూచించారు.
బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకున్న సొమ్ముతో టీవీలు, పేపర్లు పెట్టుకొని తప్పుడు వార్తలు రాస్తున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్పారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేసి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ తెచ్చిన రూ. 8 లక్షల కోట్ల అప్పుతో నెలకు రూ.6,500 కోట్లు వడ్డీలకే పోతున్నాయన్నారు. అడ్డగోలుగా దోచుకుని ప్రజల మీద అప్పులు, వడ్డీల బారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎక్కడ సంక్షేమ ఆగకుండా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ మూడేళ్లే కాదు వచ్చే ఐదేళ్లు కూడా ప్రభుత్వం తమదేనన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం మీ ఓటుతో తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ కు మద్దతుగా బోరబండలోని మధురానగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
Kishan Reddy: గోవులను మతంతో ముడిపెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి
KTR: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోంది: కేటీఆర్