AV Ranganath: ఈటల వ్యాఖ్యలు సరి కాదు
ABN , Publish Date - May 12 , 2025 | 04:22 AM
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి తహశీల్దార్ స్థానికంగా ఉన్న రెండు అపార్ట్‌మెంట్లకు ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు: రంగనాథ్
హైదరాబాద్ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి తహశీల్దార్ స్థానికంగా ఉన్న రెండు అపార్ట్‌మెంట్లకు ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ నోటీసులను హైడ్రాకు ముడిపెడుతూ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తహశీల్దార్ నోటీసులు ఎందుకిచ్చారో తెలుసుకోవాలని మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రతి నోటీసు, కూల్చివేతను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం దురదృష్టకరమన్నారు. బడా భూకబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరించే హైడ్రా.. సామాన్యులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. సచివాలయంలో కలిసినప్పుడు వచ్చిన చర్చలో హైడ్రా కార్యకలాపాలను తాను ఈటలకు స్పష్టంగా వివరించానన్నారు. హైడ్రా పని తీరుపై ప్రజలు స్పష్టతతో ఉన్నారని, అనవసరమైన ఆరోపణలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని సూచించారు. 2024 జూలై 24 కంటే ముందు నిర్మించిన నివాసాలు, అనుమతులు తీసుకున్న వాణిజ్య సముదాయాల జోలికి హైడ్రా వెళ్లదని ఆయన చెప్పారు.
మతి తప్పి మాట్లాడుతున్నడు: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. మర్యాదస్తుడనుకుంటే.. మతి తప్పి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తన పార్టీలో పదవుల కోసం సీఎం రేవంత్‌రెడ్డిపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే పార్టీ అధిష్ఠానాన్ని కాకా పట్టుకోవాలే కానీ.. మా సీఎం రేవంత్‌ను తిడితే పదవి వస్తుందనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనం. ఈటల నీచ భాషను ఆపకపోతే.. మేం ఆ భాషలోకే దిగా ల్సి వస్తుంది’ అంటూ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News