Share News

Bettig Apps: సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌తో కోట్లకు కోట్లు ఎలా సంపాదిస్తున్నారంటే..

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:50 PM

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో కొంతమందిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేశారు. అసలు బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రెటీల పేరుతో వీరు చేస్తున్న దందా ఏమిటో తెలుసుకుందాం.

Bettig Apps: సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్‌తో కోట్లకు కోట్లు ఎలా సంపాదిస్తున్నారంటే..
Online Gambling

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కొందరు సెలబ్రెటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు కేసులు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో దీనిని సెలబ్రెటీలు డబ్బులు సంపాదించడానికి సులవైన మార్గంగా ఎంచుకుంటున్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్‌తో లక్షలాది మంది సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందుల పడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ దశలో బెట్టింగ్ యాప్స్‌ నిర్వహిస్తున్నవారిపై, ప్రమోట్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్‌‌ ప్రమోషన్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు. దీనిని ఎందుకు ఆదాయమార్గంగా ఎంచుకుంటున్నారో తెలుసుకుందాం.


ప్రతి వ్యక్తిపై కమిషన్

బెట్టింగ్‌లో డబ్బులు సంపాదించడంకంటే పొగొట్టుకునేవారి సంఖ్య ఎక్కువ. సాధారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పొగొట్టుకున్నవారి జాబితాలో ఎక్కువుగా ఉంటారు. డబ్బుల అవసరం ఎక్కువుగా ఉండే వ్యక్తులు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఒక ఆశతో జూదానికి అలవాటుపడతారు. మొదట తక్కువ మొత్తంలో ఆడదామని వస్తే వస్తాయి.. పోతే పోతాయనే కాన్సెప్ట్‌లో బెట్టింగ్‌‌కు అలవాటుపడతారు. తీరా డబ్బులు పోయిన తర్వాత కనీసం మన డబ్బులు మనకు వచ్చేవరకు ఆడదామనే ఆలోచనతో అప్పులు చేసి ఆడటం మొదలుపెడతారు. రుణ భారం ఎక్కువ కావడంతో తీర్చే ఓపిక లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇటీవల కాలంలో చాలామంది బెట్టింగ్ యాప్‌లను డెవలప్ చేసి, వాటిని ప్రమోట్ చేయడానికి సెలబ్రెటీలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో సెలబ్రెటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటుచేసి ఆ గ్రూప్స్‌లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ యాప్‌లలో ఓ వ్యక్తి చేసిన డిపాజిట్‌పై పర్సంటేజీలను ప్రమోట్ చేసిన వ్యక్తులకు వస్తుంది. ఈ విధానం ద్వారా కొందరు రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. సాధారణంగా యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్స్‌, బల్లితెర నటులు తమ వీడియోలు, నటన ద్వారా నెలకు సంపాదించే మొత్తం తక్కువుగానే ఉంటుంది. పేరున్న నటులు మాత్రమే లక్షకు పైగా సంపాదించగలుగుతారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ ద్వారా.. ఎంత ఎక్కువమందిని ఆకర్షించి డిపాజిట్ చెయ్యిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. దీంతో ఎక్కువమంది ఈ యాప్స్ ప్రమోషన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.


టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా

ఇన్‌ఫ్లూయన్సర్స్‌ చాలామంది టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రెటీలకు చెందిన టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఎక్కువమంది జాయిన్ అవుతూ ఉంటారు. మొదట ఎక్కువమందిని గ్రూపులో చేర్చుకోవడమే లక్ష్యంగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఆ తర్వాత అదే గ్రూపులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట యాప్‌లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్‌తో పాటు లాస్ పేమెంట్‌పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తుంటారు. ఇలాంటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 18 , 2025 | 05:29 PM