High Court: సహజీవనం చేశాక లైంగికదాడి కేసు చెల్లదు
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:39 AM
అన్ని విషయాలు తెలిసీ ఒక వ్యక్తితో సహ జీవనం చేశాక.. తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించలేరని హైకోర్టు తేల్చి చెప్పింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్‌పై కేసు కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అన్ని విషయాలు తెలిసీ ఒక వ్యక్తితో సహ జీవనం చేశాక.. తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ టీ.రంజిత్‌పై నమోదైన కేసును కొట్టేసింది. ఫిర్యాదుదారు మహిళ మేజరై ఉండి సహ జీవనం చేశాక తనపై అత్యాచారం చేశారని ఆరోపించడం సరి కాదని, దీనికి పురుష భాగస్వామిని బాధ్యుడ్ని చేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) విద్యార్థిని (29) ఫిర్యాదుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ టీ రంజిత్ (49)పై పోలీసులు లైంగికదాడి కేసు పెట్టారు. తనకు వివాహమైనట్లు తెలిసీ రెండేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు తనపై లైంగికదాడి కేసు పెట్టడం చెల్లదని రంజిత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారించింది. ఇదే మహిళ గతంలో తనతో సహ జీవనం చేసిన బీ కేశవ్‌కుమార్ అనురాగ్ అనే వ్యక్తిపైనా పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఫిర్యాదుదారు మహిళ మేజరై ఉండటంతోపాటు పిటిషనర్ రంజిత్‌కు వివాహం అయిందని.. ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిసీ ఎలా సహజీవనానికి అంగీకరించారని ప్రశ్నించింది. దీంతోపాటు ఫిర్యాదుదారు మహిళ గతంలోనూ ఇదే తరహాలో కేసులు పెట్టిన నేపథ్యంలో కేసు కొట్టేస్తున్నామని పేర్కొంది.