High Court: రెవెన్యూ శాఖకు ‘సాదాబైనామా’ సవాళ్లు
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:24 AM
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు పచ్చజెండా ఊపడంతో వీటికి మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ దరఖాస్తులను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖకు పలు సమస్యలు ఎదురయ్యేలా కనిపిస్తోంది.
భూభారతి నిబంధనల్లో మార్పులు మార్గదర్శకాల్లో స్పష్టత అవసరం
పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యుల్ తేవాలి
ప్రస్తుతం పెండింగ్‌లో 9.26 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు పచ్చజెండా ఊపడంతో వీటికి మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ దరఖాస్తులను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖకు పలు సమస్యలు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి ప్రస్తుత నిబంధనల్లో మార్పు లు చేయడంతోపాటు మార్గదర్శకాల జారీలోనూ ప్రతి అంశానికి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాదాబైనామా సమస్యను పరిష్కరించేందుకు దోహదపడే మార్గదర్శకాలు, ఫార్మాట్లను రూపొందించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. 1989 నుంచి రెవెన్యూ శాఖ సాదాబైనామా సమస్యను పరిష్కరిస్తోంది. ఈ అనుభవంతో ఇప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకుగాను తొలుత ప్రకటన విడుదల చేయాలి. దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు గాను అవసరమైన ఫార్మాట్లను సిద్ధం చేయాలి. ఆ తర్వాత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంటుంది.
అసలు యజమానిఅఫిడవిట్ ఇవ్వాలి..
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి టైటిల్ నిర్ధారించడంతోపాటు భూమిపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తుంది. ఇందులో భాగంగా టైటిల్ వెరిఫికేషన్‌కు సివిల్ కోర్టు పరిశీలించినంత నిశితంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కారానికి ప్రస్తుత నిబంధనలతోపాటు అవసరమైన మార్పులు చేపడుతున్నారు. వీటిలో భూమి విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ సమర్పించడం ఒకటిగా ఉంది. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తన ఆధీనంలో 12 ఏళ్లు భూమి ఉందంటూ ఆధారాలను చూపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాంప్ డ్యూటీ ప్రకారం చలానా తీసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2014 వరకు మాన్యువల్‌గా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేవారు. 2016లో ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చేశారు. భూమికి సంబంఽధించిన ప్రతి దస్త్రాన్ని ఆన్‌లైన్‌లో పెట్టారు. రాష్ట్రం లో తాజాగా భూ భారతి చట్టం అమల్లోకి వచ్చినందున సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక మాడ్యు ల్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులను అధిగమిస్తూ.. న్యాయపరమైన చిక్కులకు తావులేకుండా సాదాబైనామా దరఖాస్తులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెడితే పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుల్లో 30ు దరఖాస్తులకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ చెబుతున్నారు. దీనికి కూడా కనీసం ఆరు నెలల సమయం పడుతుందన్నారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..
వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత