Share News

Heritage Walk Security: మిస్‌ వరల్డ్‌ అతిథుల హెరిటేజ్‌ వాక్‌కు భారీ బందోబస్తు

ABN , Publish Date - May 02 , 2025 | 05:32 AM

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు, విదేశీ ప్రతినిధులు మే 13న చార్మినార్‌ నుంచి చౌమహల్లా ప్యాలెస్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించనున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు ఈ కార్య‌క్ర‌మాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Heritage Walk Security: మిస్‌ వరల్డ్‌ అతిథుల హెరిటేజ్‌ వాక్‌కు భారీ బందోబస్తు

  • 13న చార్మినార్‌ను సందర్శించనున్న సుందరీమణులు, విదేశీ ప్రతినిధులు

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : మిస్‌ వరల్డ్‌ పోటీదారులు, విదేశీ ప్రతినిధులు మే 13న చార్మినార్‌ నుంచి చౌమహల్లా ప్యాలెస్‌ వరకు చేపట్టనున్న హెరిటేజ్‌ వాక్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చార్మినార్‌ లాడ్‌బజార్‌, మోతీగల్లి, చౌమహల్లా ప్యాలెస్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా సాయుధ బలగాలు, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి కర్ణన్‌, పర్యాటక శాఖ డైరెక్టర్‌ హన్మంతు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకా్‌షరెడ్డి, దక్షిణ మండలం డీసీపీ స్నేహ మేరతో కూడిన అధికారుల బృందం గురువారం సాయంత్రం చార్మినార్‌ నుంచి చౌమహల్లా ప్యాలెస్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని సందర్శించింది. అనంతరం చౌమహల్లా ప్యాలె్‌సలో సమావేశమైన అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు, వారి వెంట వచ్చే ప్రతినిధులు మే13వ తేదీ సాయంత్రం చార్మినార్‌నుంచి చౌమహల్లా ప్యాలెస్‌ వరకు సందర్శిస్తారు. ఈ కార్యక్రమానికి హెరిటేజ్‌ వాక్‌ అని పేరు పెట్టారు. అయితే, హెరిటేజ్‌ వాక్‌ జరిగే సమయంలో ఎంపిక చేసిన గాజులు, ముత్యాలు, నగల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఆయా దుకాణాల యజమానులు, వాటిల్లో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని హెరిటేజ్‌ వాక్‌ సమయంలో లోపలికి అనుమతించరు. అలాగే, హెరిటేజ్‌ వాక్‌కు ఎంత సమయం అవసరం, షాపింగ్‌కు ఎంత సమాయాన్ని కేటాయించాలి, చౌమహల్లా ప్యాలస్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు, రాత్రికి వెల్కం డిన్నర్‌ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు సమీక్షించారు.


For Telangana News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:33 AM