Crop Recovery: పంటలకు ఊపిరి!
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:20 AM
రాష్ట్రంలో 3-4 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. మే నెలాఖరులోనే మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేశాయి.
రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌లకు జీవం
పుంజుకుంటున్న వరి నాట్లు.. తగ్గిన లోటు వర్షపాతం
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 3-4 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. మే నెలాఖరులోనే మురిపించిన వర్షాలు తర్వాత ముఖం చాటేశాయి. ఆ తర్వాత అడపాదడపా వానలు కురిసినా సాధారణ స్థాయికి చేరుకోలేదు. తాజాగా కురుస్తున్న వర్షాలతో నీటికొరతను ఎదుర్కొంటున్న పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ఇతర ఆరుతడి పంటలకు జీవమొచ్చింది. వరి నాట్లు పుంజుకోవడానికి మార్గం సుగమమైంది. గ్రేటర్ హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం ఉన్నా.. 23 జిల్లాలు వర్షాభావ పరిస్థితుల నుంచి సాధారణ స్థాయికి చేరాయి. దీంతో కొద్ది రోజుల క్రితం వరకు 30శాతం ఉన్న లోటు వర్షపాతం ఇప్పుడు 10 శాతానికి తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. జూన్ 1 నుంచి జూలై 23 వరకు రాష్ట్రంలో 29.78 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 26.79 సెం.మీ. మాత్రమే నమోదైంది. మంగళవారం (22న) ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు రాష్ట్రంలో 2.83 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ 24 గంటల వ్యవధిలో 1 సెం.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 183 శాతం అధికంగా నమోదైంది. రాష్ట్రంలోని 621 మండలాల్లోని 47 మండలాల్లో అధిక, 5 మండలాల్లో అత్యధికంగా, ఒక మండలంలో (ములుగు జిల్లా వెంకటాపురం) అసాధారణంగా వర్షం కురిసింది. 301 మండలాల్లో ఓ మోస్తరు, 171 మండలాల్లో స్వల్ప, 61 మండలాల్లో అతిస్వల్పంగా వర్షం కురిసింది. 35 మండలాల్లో వర్షం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణ స్థాయిని మించి 20-35 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది.
పంటల సాగు విస్తీర్ణం ఇలా..
రాష్ట్ర సాధారణ సాగు విస్తీర్ణం 1,32,44,305 ఎకరాలు కాగా... ఇప్పటివరకు 76,28,084 ఎకరాల్లో రైతులు పంటలు వేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ బుధవారం నివేదికలో పేర్కొంది. వరి సాధారణ విస్తీర్ణం 62,47,868 ఎకరాలు కాగా.. 17,52,144 ఎకరాల్లో (28.4 శాతం) నాట్లు వేశారు. పత్తి సాధారణ విస్తీర్ణం 48,93,016 ఎకరాలు కాగా 42,00,411 ఎకరాల్లో (85.85 శాతం) సాగు పూర్తయింది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5,21,206 ఎకరాలు కాగా... 5,20,527 ఎకరాల్లో(99.87శాతం) పంట వేశారు. కంది 62.95 శాతం, సోయాబీన్ 83.12శాతం విస్తీర్ణంలో సాగయ్యాయి. ఇతర పంటలు, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు పురోగతిలో ఉందని వ్యవసాయశాఖ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News