Heavy Rains: ఆల్మట్టికి భారీ వరద
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:28 AM
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద వస్తోంది. కర్ణాటకలో ఆల్మట్టిలోకి శుక్రవారం సాయంత్రానికి 1,15,339 క్యూసెక్కుల వరద వస్తుండగా, కిందకు 70,420 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
హైదరాబాద్/ అమరావతి/ బెంగళూరు/ ధరూరు/దోమలపెంట, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద వస్తోంది. కర్ణాటకలో ఆల్మట్టిలోకి శుక్రవారం సాయంత్రానికి 1,15,339 క్యూసెక్కుల వరద వస్తుండగా, కిందకు 70,420 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టులో 30.64 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, దిగువకు 68,498 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.52 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 12 గేట్లు ఒక మీటర్ ఎత్తి 85,268 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వైపు 1,08,325 క్యూసెక్కుల నీరు వస్తుండగా, జలాశయానికి 1,02,655 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నీటి మట్టం సామర్థ్యం 215.807 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 125.1322 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. తుంగభద్ర జలాశయానికి 44 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇక దిగువన నాగార్జున సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు ప్రస్తుతం 138.91 టీఎంసీలు, పులిచింతల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు 23.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ముందే నిండిన కృష్ణరాజ సాగర డ్యాం
కర్ణాటకలో కావేరి నదిపై నిర్మించిన ప్రధాన జలాశయం కృష్ణరాజసాగర డ్యాం పూర్తిగా నిండింది. జూన్ నెలాఖరుకే ప్రాజెక్టు నిండడం 84 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 124.80 అడుగులు కాగా.. పూర్తి స్థాయిలో నీరు చేరింది. కేరళతోపాటు కొడగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. కావేరిపై ఉన్న హారంగి, కబిని, హేమావతి డ్యాంలు కూడా దాదాపు నిండాయి.