Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన.. ఈ మార్గాల్లో వెళ్లారో..
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:41 PM
Traffic Alert: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్: నగరంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. సాయంత్రం భారీ వర్షం కురిస్తే పలు ఏరియాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అమీర్‌పేట్, బేగంపేట్, రసూల్‌పురా, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, శిల్పారామం, నెక్టార్ గార్డెన్, మాదాపూర్ సీవోడీ, మాదాపూర్ ఐకియా, గచ్చిబౌలి బయోడైవర్సిటీ, కేపీహెచ్‌బీ దారుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తవచ్చు. వాహనదారులు ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణించటం ఉత్తమం.
నిన్న నీట మునిగిన నగరం..
భారీ వర్షాల కారణంగా నిన్న(గురువారం) హైదరాబాద్ నగరం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ నదుల్ని తలపించాయి. మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. సెల్లార్లలోకి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరింది. పుప్పాల గూడలో 35 అడుగుల భారీ గోడ కూలింది. 2008లో శివాలయానికి రక్షణగా ఈ గోడ నిర్మించారు. వర్షాల కారణంగా గోడ కుప్పకూలింది. అంతేకాదు.. వరద ధాటికి మూడు ఇళ్లు కొట్టుకుపోయాయి. వాటిలో ఎవరూ లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది.
మరో ఐదు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 9, 10 తేదీల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక, 13వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు