Share News

Heavy Rains Flood: ఉమ్మడి ఖమ్మంలో కుండపోత

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:22 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన ముంచెత్తగా.. మహబూబాబాద్‌ జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షం పడింది..

Heavy Rains Flood: ఉమ్మడి ఖమ్మంలో కుండపోత

మహబూబాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షం.. కొత్తగూడెంలో 19.2 సెం.మీ. వర్షపాతం

  • పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

  • భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి

  • నేడు, రేపు అతి భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన ముంచెత్తగా.. మహబూబాబాద్‌ జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షం పడింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. కొత్తగూడెం జిల్లాలో 7.98 సెం.మీ., ఖమ్మం జిల్లాలో 5.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తగూడెంలో 19.2 సెం.మీ., అదే జిల్లా చుంచుపల్లిలో 17.6, ఇల్లెందులో 15 సెం.మీ. వర్షం కురిసింది. కొత్తగూడెంలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. విద్యానగర్‌కాలనీలోని కొత్తగూడెం-ఖమ్మం ప్రధాన రహదారిపై వర్షపు వరద నీరు భారీగా చేరింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో పెద్దకాల్వ పొంగిపొర్లడంతో ఇందిరానగర్‌, శ్రీనగర్‌ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పినపాక మండలంలోని పెద్దవాగు, ఇల్లెందు మండలంలోని మసివాగు, జెండాల వాగు ఉధృతితో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ముల్కలపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్‌ పరిధిలో 134 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో.. గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటు ఎగునన భారీ వర్షాలు లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. సోమవారం ఉదయం 7.37 గంటలకు 42.9 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను భద్రాచలం సబ్‌కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట ఉపసంహరించారు. ఖమ్మం జిల్లాలో కొణిజర్ల, చింతకాని, సత్తుపల్లి, పెనుబల్లి, వైరా మండలాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం వద్ద మున్నేరు 14 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఏన్కూరు మండలంలో పత్తి, మిర్చి పొలాలు నీట మునిగాయి. మహబూబాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన గూడూరు, కొత్తగూడ, బయ్యారం, డోర్నకల్‌, గార్ల, మహబూబాబాద్‌ మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలాయి. గూడూరు మండలంలో పాకాల వాగు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.


నేడు, రేపు అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రెండు రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 04:22 AM