Share News

Heavy Rains Cause Flooding: ముంచెత్తిన వాన

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:04 AM

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి.. గురువారం కొన్ని జిల్లాల్లో కొద్ది గంటల్లోనే కుండపోత వర్షాలు కురవగా..

Heavy Rains Cause Flooding: ముంచెత్తిన వాన

  • రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచి కొట్టిన వర్షాలు

  • ములుగు జిల్లా జేడీ మల్లంపల్లిలో 19.4 సెం.మీ.

  • మెదక్‌లో 3 గంటల్లో 17 సెం.మీ.ల వాన

  • హుజూరాబాద్‌లో 2 గంటల్లోనే 16 సెం.మీ.

  • లోతట్టు ప్రాంతాల మునక.. నిలిచిన రాకపోకలు

  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం

  • హైదరాబాద్‌-విజయవాడ హైవేపై హయత్‌నగర్‌ వద్ద భారీగా నిలిచిన నీరు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి.. గురువారం కొన్ని జిల్లాల్లో కొద్ది గంటల్లోనే కుండపోత వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో పొద్దంతా ఎడతెరిపి లేకుండా ముసురు పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లగా.. పంటపొలాలు మునిగిపోయాయి. గురువారం (ఉదయం 8.30 నుంచి రాత్రి 9 వరకు) అత్యధికంగా ములుగు జిల్లా జేడీ మల్లంపల్లిలో 19.40 సెంటీమీటర్ల వర్షం కురవగా.. రంగారెడ్డి జిల్లా గున్‌గల్‌లో 18 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో 17.5, అదే జిల్లా మోటకొండూర్‌లో 16.5 సెం.మీ. వాన పడింది. ఇక మెదక్‌లో 3 గంటల్లోనే 17 సెం.మీ. కురవగా.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని బోర్నపల్లిలో 2 గంటల్లోనే 16 సెం.మీ. వర్షం పడింది. మెదక్‌లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సన్నగా ప్రారంభమైన వర్షం కాస్తా కాసేపటికి కుంభవృష్టిలా మారింది. ప్రధాన కూడలి రాందాస్‌ చౌరస్తా వద్ద కార్లు, బస్సులు, బైక్‌లు నీట మునిగాయి. ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ మహిళా కళాశాల ప్రాంగణం పూర్తిగా జలమయమవడంతో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. హనుమకొండ, వరంగల్‌ బస్‌స్టేషన్లలో వరద పెద్ద ఎత్తున నిలిచి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండలోని పలు కాలనీల్లో భారీగా వరద ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలోని జేడీ మల్లంపల్లి, తాడ్వాయి, వాజేడు, ఏటూరునాగారం, వెంకటాపురం మండలాల్లో వానలకు అక్కడక్కడ పంటపొలాలు నీట మునిగాయి. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలంలో భారీ వర్షం కురిసింది. జహీరాబాద్‌ రోడ్డులో బండపల్లి-తట్ట్టేపల్లి మధ్య వాగు పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధారూరు బస్‌స్టేషన్‌ ప్రాంగణమంతా జలమయంగా మారింది. తాండూరు మండలం సంగెంకలాన్‌ శివారులో ఉధృతంగా ప్రవహిస్తున్న దిడ్డి వాగులో స్థానికుడు బొక్తంపల్లి మొగులప్ప(38) గల్లంతయ్యాడు. ఆదిలాబాద్‌లో పలు కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. తర్నం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.


యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో భారీ వర్షానికి ఆలేరు-సిద్దిపేటకు వెళ్లే మార్గంలో పెద్దవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలేరులో పలు కాలనీలు జలమయమయ్యాయి. కుమ్మరివాడలోని 50 ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నీరు చేరిన ఇళ్లను పరిశీలించి స్థానికులతో మాట్లాడి సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు. భువనగిరి మండలం తుక్కాపూర్‌, అనంతారం గ్రామాల్లో పిడుగుపాటుకు రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. యాదగిరిగుట్టలో వర్షానికి రహదారులు, బస్టాండ్‌ జలమయమయ్యాయి. మోటకొండూరు ఊర చెరువు అలుగుపోస్తుండటంతో పత్తి చేలలో నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం కురవగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ విస్తారంగా వానలు పడ్డాయి.

హయత్‌నగర్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌..

రంగారెడ్డి జిల్లా యాచారం, అబ్ధుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. హయత్‌నగర్‌ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించి 2 గంటలకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఇటు రామోజీఫిల్మ్‌ సిటిని కూడా వరద ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ఫిల్మ్‌సిటీ లోపలున్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వర్షాలతో జాగ్రత్తగా ఉండాలి సీఎం రేవంత్‌

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, ట్రాఫిక్‌, పోలీసు శాఖల సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లాలని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి ప్రవహించే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నచోట నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

5.jpg4.jpg2.jpg1.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Sep 12 , 2025 | 04:04 AM