Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. స్తంభించిన జనజీవనం..
ABN , Publish Date - Aug 29 , 2025 | 06:22 PM
హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, అంబర్ పేట్, కాచిగూడ, ఓయూ క్యాంపస్, విద్యానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గంట సేపటి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, అంబర్ పేట్, కాచిగూడ, ఓయూ క్యాంపస్, విద్యానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.
లకిడీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ ప్రయాణం కోసం గంటల సమయం పడుతోంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 2 వరకు తెలంగాణలో వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు(శనివారం) ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీలో గొడవ.. కొట్టుకున్న ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు..
తీవ్ర విషాదం.. ఇన్‌స్టంట్ న్యూడిల్స్ తిని బాలుడు మృతి..