Heavy Rain: వేల బస్తాల ధాన్యం తడిసిముద్ద
ABN , Publish Date - May 04 , 2025 | 04:57 AM
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. మార్కె ట్ యార్డ్‌లో ఆరబోసిన వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది.
ఆమనగల్లులో అకాల వర్షంతో భారీగా నష్టం
కొట్టుకుపోయిన మార్కెట్ యార్డులోని ధాన్యం
కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహించిన రైతులు
హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాస్తారోకో
రాష్ట్రంలో పలుచోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత
నేడు, రేపు వర్ష సూచన
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. మార్కె ట్ యార్డ్‌లో ఆరబోసిన వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. గత నెల 18న ఆమనగల్లు మార్కెట్ యార్డ్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చారు. శనివారం ఉదయం సుమారు 800 బస్తాల ధాన్యాన్ని తూకం వేసి మిల్లుకు తరలించడానికి మార్కెట్ ఆవరణలో ఉంచారు. అకాల వర్షంతో ఆరబోసిన, కుప్పలు వేసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోళ్లలో జాప్యం వల్లే ధాన్యం తడిసి నష్టం వాటిల్లిందని ఆగ్రహించిన రైతులు హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. రైతు ల ఆందోళనకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సీఐ జానకిరామ్ రెడ్డి రైతులు, బీఆర్‌ఎస్ నాయకులకు నచ్చజెప్పి మార్కెట్ యార్డులోకి తీసుకువెళ్లారు.
మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీతా నర్సింహతో మాట్లాడి కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కేశంపేట మండలంలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కొత్తపేట-కోనాయపల్లి గ్రామాల ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. యాచారం, కడ్తాల మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో ధాన్యం నీటి పాలైంది. మామిడికాయలు నేలరాలాయి. మరోవైపు, రాష్ట్రంలో మండుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. శనివారం నిర్మల్ జిల్లాలో అత్యధికంగా దస్తూరాబాద్‌లో నర్సాపూర్(జి)లో 45.2 డిగ్రీలు, భైంసా, దస్తూరాబాద్, కుభీర్, కుంటాల, తానూర్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఊడిపడ్డ చర్లపల్లి రైల్వే స్టేషన్ పైకప్పు
పగిలిన సోలార్ విద్యుత్ ఫలకాలు

కుషాయిగూడ, మే 3 (ఆంధ్రజ్యోతి): కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ ప్రధాన భవనం డొల్లతనం బయటపడింది. శనివారం సాయంత్రం ఈదురుగాలుతో కూడిన వర్షానికి పైకప్పు భాగాలు, సోలార్ విద్యుత్ ఫలకాలు ఊడిపడ్డాయి. 3 నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన రైల్వే టెర్మినల్ 9వ నంబరు ప్లాట్‌ఫామ్‌ను ఆనుకొని ఉన్న ప్రవేశ ద్వారం రూఫింగ్ షీట్లు, రేకులు, ఈ ఫలకా లు పెద్ద శబ్దం చేస్తూ పడిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు, సిబ్బంది లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భవనం పైకప్పు భాగా లు 30 మీటర్ల ఎత్తు నుంచి పడడంతో సిబ్బంది కంగారుగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే కారణమని తెలుస్తోంది.