Heavy Flood Releases in Sagar: సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:10 AM
ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు పర్యాటకుల కేరింతలు సాగర్‌లో కనువిందు చేస్తున్నాయి. ..
భారీగా తరలివచ్చిన పర్యాటకులు
‘శ్రీశైలం’కు స్వల్పంగా తగ్గిన వరద
నాగార్జునసాగర్/కేతేపల్లి/గద్వాల/మహదేవపూర్ రూరల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు పర్యాటకుల కేరింతలు సాగర్‌లో కనువిందు చేస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సాగర్ పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, విజయవిహార్, కొత్తవంతెన, ప్రధాన జలవిద్యుత్ కేంద్రంవద్ద పర్యాటకుల రద్దీ నెలకొంది. ఏపీ-తెలంగాణ సరిహద్దులో కొత్త వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల వారం రోజులుగా కొనసాగుతోంది. సాగర్‌కు ఎగువ నుంచి 4,16,324 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 585 అడుగులు(297.4350టీఎంసీలు)గా ఉంది. సాగర్‌నుంచి కుడి కాల్వ ద్వారా 9,019 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 7,518 క్యూసెక్కుల నీటిని, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,373 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని, 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3,63,714 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి 1,702.87 క్యూసెక్కులుగా నమోదైంది. మరోవైపు ప్రాజెక్టు నీటిమట్టం 643.45అడుగుల గరిష్ఠస్థాయికి చేరడంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 2, 3, 8వ నెంబరు క్రస్టుగేట్లను అడుగు మేర ఎత్తి 1,935.51క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్టుకు 4.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. 10 గేట్లను 16 ఫీట్ల మేరకు ఎత్తి 3,80,380 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 61,711 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 195.66 టీఎంసీల నిల్వ ఉన్నది. ప్రస్తుతం జూరాలకు 3.72లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 37గేట్లను ఎత్తి 3,53,573 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీలోకి 4.40 లక్షల క్యూసెక్కులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీలోకి 4.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 5.6 మీటర్లుగా నమోదైంది.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News