Health Report: గుట్టుగా వ్యాధులు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:38 AM
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆస్పత్రుల్లో 25 లక్షలమందికిపైగా వ్యక్తులకు చేసిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీలివర్
దీర్ఘకాల వ్యాధులున్నట్లు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది
అపోలో ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ నివేదిక
దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్యపరీక్షలు
తెలంగాణలో 23ు మందికి అధిక రక్తపోటు
ప్రీ-హైపర్ టెన్షన్ దశలో మరో 55 శాతం మంది
షుగర్ పేషెంట్లు 25ు.. ప్రీడయాబెటిక్ దశలో 34ు
49ు మందికి గ్రేడ్1 ఫ్యాటీలివర్.. 5శాతానికి గ్రేడ్2
ఫ్యాటీలివర్ ఉన్నవారిలో మద్యం తాగనివారు 85ు
మెనోపాజ్ తర్వాత మహిళల్లో షుగర్, ఊబకాయం
స్త్రీ, పురుషులిద్దరిలోనూ డి విటమిన్ లోపం ఎక్కువే
చిన్నపిల్లల్లోనూ ఊబకాయం.. యువతకు హైబీపీ
కాలేజీ విద్యార్థుల్లో 19% ప్రీ హైపర్‌టెన్షన్ దశలో!
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): అధిక రక్తపోటు.. పైకి ఏ లక్షణమూ కనిపించదు! లోలోపలే శరీరానికి తీరని నష్టం చేస్తుంది!! మధుమేహం.. అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలున్నా చాలామంది పట్టించుకోరు!! ఈ రెండింటికీ తోడు.. ఇటీవలికాలంలో బాగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్!! పరీక్ష చేస్తే కానీ బయటపడని ఈ జీవనశైలి రుగ్మతలు తమకు ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాలం గడిపేస్తున్నట్టు అపోలో ఆస్పత్రి సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆస్పత్రుల్లో 25 లక్షలమందికిపైగా వ్యక్తులకు చేసిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. దాని ప్రకారం.. తెలంగాణలోని పలు అపోలో ఆస్పత్రుల్లో 44,448 మందికి పరీక్షలు చేయగా.. వారిలో 10,427 మంది (23ు) అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు తేలింది. మరో 24,246 మంది (55ు) ప్రీహైపర్‌టెన్షన్ (అంటే బీపీ రావడానికి ముందు) దశలో ఉన్నట్టు వెల్లడైంది. అలాగే.. 40,897 మందికిగాను 10,355 మంది (25ు) మధుమేహ బాధితులు ఉండగా.. డయాబెటిస్ రావడానికి ముందు దశలో ఏకంగా 14 వేల మంది (34ు) ఉన్నారు. ఇక.. పరీక్షలు చేయించుకున్నవారిలో 63 శాతం మంది ఊబకాయంతో.. 19ు మంది అధికబరువుతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. డిస్‌లిపిడెమియా (అంటే అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ స్థాయులు ఉండడం)తో బాధపడుతున్నవారు 47ు మంది ఉన్నారు. కుంగుబాటు, వ్యాకులత వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చెరో 3 శాతం మంది ఉన్నట్టు తేలింది. కాలేయ సంబంధిత పరీక్షలు 32,333 మందికి చేయగా.. వారిలో 49 శాతం మంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. మరో 5 శాతం మంది రెండో దశ ఫ్యాటీ లివర్‌తో.. 80 మంది గ్రేడ్ 3, ఆరుగురు గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. నిత్యం కాసేపు ఎండలో ఉంటే ఉచితంగా వచ్చే డి విటమిన్ లోపంతో బాధపడుతున్నవారు ఏకంగా 82 శాతం మంది ఉండడం గమనార్హం.
దేశవ్యాప్త గణాంకాలు..
దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి బీపీ పరీక్ష చేయగా.. వారిలో 26ు మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్టు తేలింది. అలాగే.. 23ు మంది మధుమేహంతో, 65 శాతం మంది ఫ్యాటీలివర్‌తో, 46 శాతం మంది అథెరోస్క్లెరోసిస్ (రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయే) సమస్యతో బాధపడుతున్నట్టు అపోలో నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా.. ఫ్యాటీలివర్ బారిన పడినవారిలో 85 శాతం మందికి అసలు మద్యపానం అలవాటే లేదని.. అథెరోస్క్లెరోసిస్ బాధితుల్లో 2.5 శాతం మంది 40 ఏళ్లలోపువారే కావడం ఆందోళనకరమని నివేదిక పేర్కొంది. అలాగే.. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు నివేదిక ఆందోళన వెలిబుచ్చింది. అపోలో పరీక్షలు చేసినవారిలో మెనోపాజ్‌కు ముందు మధుమేహం బారిన పడినవారు 14ు ఉంటే.. మెనోపాజ్ తర్వాత ఆ సంఖ్య 40 శాతానికి చేరిందని పేర్కొంది. బాలల్లోనూ, యువతలోనూ పెరుగుతున్న ఊబకాయంపై ఆ నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాథమిక పాఠశాలల పిల్లల్లో 8 శాతం మంది, కాలేజీ విద్యార్థులు 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. యువతలో 19 శాతం మందిలో ముందస్తు రక్తపోటు (ప్రీహైపర్‌టెన్షన్) సమస్య కనిపించడం. పౌష్టికాహార లోపం, శారీరక శ్రమ లేకపోవడం, యువతలో ఒత్తిడి పెరిగిపోవడం ఈ సమస్యకు కారణంగా భావిస్తున్నారు. ఇక.. దేశవ్యాప్తంగా 53 వేల మందికి నిద్ర రుగ్మతలకు సంబంధించిన పరీక్షలు చేయగా వారిలో 24 శాతం మంది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియాతో బాధపడుతున్నట్టు తేలింది. అలాగే.. రక్తహీనత సమస్యతో 45ు మంది మహిళలు, 26ు మంది పురుషులు బాధపడుతుండగా.. విటమిన్ డి లోపం స్త్రీ, పురుషుల్లో వరుసగా 77ు, 82 శాతంగా ఉంది. విటమిన్ బి12 లోపం 38 శాతం మంది పురుషులు, 27 శాతం మంది మహిళల్లో ఉన్నట్టు తేలింది. 40 ఏళ్లలోపు వారిలో ఈ లోపం మరింత స్పష్టంగా కనిపించింది. బి12 లోపం ఉన్నవారు వైద్యులను సంప్రదించి, దాన్ని సరిచేసుకోకపోతే.. పలు ఆరోగ్యసమస్యల బారినపడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ముందస్తు వైద్యపరీక్షలు, జీవనశైలి మార్పుల వంటివాటి అవసరాన్ని నివేదిక నొక్కిచెప్పింది.
ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై దృష్టిపెట్టాలి
బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలున్నా.. వాటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది వైద్యపరీక్షలు చేయించుకోవట్లేదని, అలా కాకుండా ముందుగా పరీక్షలు చేయించుకుంటే వీటిలో చాలా జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చని నివేదిక సూచించింది. నివేదికలోని అంశాలపై అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతా్‌పరెడ్డి మాట్లాడారు. ప్రివెంటివ్ హెల్త్‌కేర్ అంటే భవిష్యత్‌లో నిర్ణయం తీసుకునే అంశం కాదని, ప్రస్తుతం దేశ శ్రేయస్సుకు అదే మూలస్తంభం అని ఆయన అభిప్రాయపడ్డారు. మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ వ్యాధి రావడం.. కొత్త రోగనిర్ధారణ పరీక్షల అవసరాన్ని తెలియజేస్తోందని, సంప్రదాయ స్ర్కీనింగ్ పరీక్షలు ఇక ఎంతమాత్రం సరిపోవని అపోలో ఆస్పత్రుల ఎండీ సునీతా రెడ్డి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News