Share News

High Court: ఆదివారం కూల్చివేతలు వద్దన్నా వినరా?

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:36 AM

‘వారాంతాల్లో ప్రత్యేకంగా ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టవద్దు అని చెప్పినా మీరు వినరా’? అని హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది? అంత తొందర ఎందుకు?

High Court: ఆదివారం కూల్చివేతలు వద్దన్నా వినరా?

  • హైడ్రాపై మండిపడ్డ హైకోర్టు.. హౌస్‌మోషన్‌పై విచారణ

  • కోహెడలో కూల్చివేతలు ఆపేయాలని ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘వారాంతాల్లో ప్రత్యేకంగా ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టవద్దు అని చెప్పినా మీరు వినరా’? అని హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది? అంత తొందర ఎందుకు? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా తగిన అవకాశం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని తప్పుబట్టింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ గ్రామంలో కూల్చివేతలు నిలిపేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 7వ తేదీ (శుక్రవారం)న నోటీసు ఇచ్చి 9వ తేదీన (ఆదివారం) కూల్చివేతలు చేపడుతుండటాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌. బాలరెడ్డి హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పట్టాదారు పాస్‌పుస్తకం, లింకు డాక్యుమెంట్లు, టైటిల్‌ పత్రాలు సమర్పించాలని నోటీసు ఇచ్చారని తెలిపారు. మధ్యలో శనివారం ఒక్క రోజే సమయం ఇచ్చి ఆదివారం కూల్చివేతలు చేపట్టారని చెప్పారు.


ఇది అన్యాయమని పేర్కొన్నారు. హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే సమయానికే కూల్చివేతలు మొదలు పెట్టారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. హైడ్రా తీరుపై మండిపడింది. గతంలోనే హైడ్రా కమిషనర్‌కు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరైనప్పుడు వారాంతాలు, ఆదివారాల్లో కూల్చివేతలు వద్దని స్పష్టంగా చెప్పామని గుర్తు చేసింది. దీనిపై పలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ప్రస్తావించి వాటిని చదువుకోవాలని స్పష్టంగా చెప్పామని తెలిపింది. శుక్రవారం నోటీసు ఇచ్చి.. శనివారం వ్యక్తిగత విచారణకు పిలిచి, ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత తొందర ఏమిటి ? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. కఠిన చర్యలకు దిగేముందు తగిన అవకాశం ఇవ్వాలన్న కనీస మర్యాద పాటించరా అని పేర్కొంది. ఈ మేరకు కూల్చివేతలు ఆపాలని పేర్కొంటూ టైటిల్‌ పత్రాలు సమర్పించడానికి పిటిషనర్‌కు వారంపాటు గడువు ఇచ్చింది. నోటీసులు, విచారణ, కూల్చివేతలకు తగిన సమయం ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా సెలవుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడరాదని అధికారులకు హెచ్చరించింది.

Updated Date - Feb 10 , 2025 | 04:36 AM