Share News

Food Poisoning: ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారు ?: హైకోర్టు

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:17 AM

గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చోటుచేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై వివరణ ఇవ్వడంతోపాటు వాటిని నివారించేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది.

Food Poisoning: ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారు ?: హైకోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చోటుచేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై వివరణ ఇవ్వడంతోపాటు వాటిని నివారించేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలకు సంబంధించి 2023 నాటి ప్రజాప్రయోజన వ్యాజ్యంలో చిక్కుడు ప్రభాకర్‌ అనే న్యాయవాది మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మధ్యంతర పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విషాహార ఘటనలపై చర్యలు తీసుకున్నామని, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, విద్యాసంస్థ స్థాయి ఆహారభద్రతా కమిటీలు వేశామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అవేవీ అమలు కావడం లేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు. ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ.. ప్రభుత్వ గురుకులాల్లో 3 లక్షలకు పైగా విద్యార్థులు ఆహారం తీసుకుంటున్నారని.. అరుదుగా ఎక్కడో ఓ ఘటన జరుగుతోందని.. వెంటనే సిబ్బంది, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


ఈ దశలో జోక్యం చేసుకున్న చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌.. విద్యార్థులు, హాస్టళ్లు పరిశుభ్రంగా ఉండేలా క్లీనింగ్‌ పనులు ఎవరు చేస్తారని ప్రశ్నించగా.. దానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని ఏఏజీ బదులిచ్చారు. అయితే, ఎవరి పనులు వాళ్లు చేసుకోవడంలో తప్పులేదని.. తాను రామకృష్ణ మిషన్‌ పాఠశాలలో చదువుకున్న రోజుల్లో ప్లేట్లు కడగడం, దుస్తులు ఉతకడం, తోటపని, మరుగుదొడ్లు శుభ్రం చేసుకోవడం వంటి పనులు తామే చేసేవాళ్లమని చీఫ్‌ జస్టిస్‌ ఈ సందర్భంగా తెలిపారు. దీనికి ఏఏజీ స్పందిస్తూ.. విద్యార్థులతో పనిచేయిస్తే న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వెంటనే మరో వ్యాజ్యం దాఖలు చేస్తారని చమత్కరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఎస్‌వోపీ అమలుకు కాంపిటెంట్‌ అధికారులు ఎవరు? ప్రతి విద్యార్థికి ఇచ్చే ఆహారం ఎంత? విషాహారం ఘటనలు చోటుచేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తదితర వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated Date - Sep 04 , 2025 | 05:17 AM