Share News

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ABN , Publish Date - May 15 , 2025 | 05:00 AM

డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఎస్సీ వర్గీకరణపై దాఖలైన పిటిషన్లు తేలేవరకు ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థుల సీట్ల భర్తీని ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఎస్సీ వర్గీకరణపై దాఖలైన పిటిషన్లు తేలేవరకు ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థుల సీట్ల భర్తీని ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎస్పీ వర్గీకరణపై ఇప్పటికే మాల మహానాడు, షెడ్యూల్డ్‌ కులాల ఐక్య వేదిక వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు... ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. తాజాగా నూతన ఎస్సీ వర్గీకరణ చట్టం ఆధారంగా డిగ్రీ సీట్ల కేటాయింపును ఆపాలని కోరుతూ పిటిషనర్లు మాలమహానాడు, షెడ్యూల్డ్‌ కులాల ఐక్య వేదిక పిటిషన్లలో మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 29న సీట్ల కేటాయింపు ఉందని, ఎస్సీ కులాల విద్యార్థుల సీట్ల కేటాయింపును కనీసం జూన్‌ 9వరకు ఆపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మామిడి అవినాశ్‌ రెడ్డి కోరారు. అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి వాదిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చి అమల్లోకి వచ్చిందని, అమలులో ఉన్న ఒక చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో మఽధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. వాదనలు విన్న జస్టిస్‌ పుల్ల కార్తీక్‌, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం.. దోస్త్‌ నోటిఫికేషన్‌, సీట్ల భర్తీపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణను జూన్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.


‘మైలాన్‌’ విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించవద్దు: హైకోర్టు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఉన్న మైలాన్‌ ల్యాబొరేటరీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు మఽధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మైలాన్‌లోని ఒక యూనిట్‌లో పేలుడు సంభవించడంతో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాలని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. చిన్న యూనిట్‌లో మానవ తప్పిదం వల్ల జరిగిన పేలుడుతో మొత్తం సంస్థపై చర్యలు తీసుకోవడం సబబు కాదని మైలాన్‌ తరఫు న్యాయవాది వాదించారు.

Updated Date - May 15 , 2025 | 05:00 AM