Share News

High Court: రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చలేరు!

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:38 AM

తెల్లారేసరికి హైదరాబాద్‌ నగరాన్ని మార్చేస్తామన్న భ్రమలో హైడ్రా ఉన్నట్లుందని, 24 గంటల్లో ఏదీ మార్చలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. పౌరులకు 24 గంటల సమయం ఇచ్చి.. టైటిల్‌, ఇతర అన్ని పత్రాలు సమర్పించాలని ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని పేర్కొంది.

High Court: రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చలేరు!

  • ‘శనివారం విచారణ.. ఆదివారం కూల్చివేత’ను ఆపండి

  • అలా చేయడం తీర్పులకు విరుద్ధం: హైకోర్టు

  • హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ ప్రత్యక్ష హాజరుకు ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): తెల్లారేసరికి హైదరాబాద్‌ నగరాన్ని మార్చేస్తామన్న భ్రమలో హైడ్రా ఉన్నట్లుందని, 24 గంటల్లో ఏదీ మార్చలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. పౌరులకు 24 గంటల సమయం ఇచ్చి.. టైటిల్‌, ఇతర అన్ని పత్రాలు సమర్పించాలని ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని పేర్కొంది. శనివారం రోజు విచారణ జరిపి.. ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టడం గర్హనీయమని ఆక్షేపించింది. ఓ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం... వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టరాదన్న తీర్పులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు సైతం ఇచ్చామని వాటిని చదువుకోవాలని చెప్పామని పేర్కొంది. హైడ్రా ఇస్తున్న 24 గంటల నోటీసులు, ఆదివారం కూల్చివేతలపై హైకోర్టులో ఇప్పటికే చాలా పిటిషన్‌లు దాఖలయ్యాయని తెలిపింది.


రెండో శనివారం విచారణ చేపట్టి టైటిల్‌ ఉందా? లేదా? అని నిర్ణయించి.. మరుసటి రోజు ఆదివారం కూల్చివేతలు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. చట్టవిరుద్ధమైన పనులకు హైడ్రా పాల్పడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ ఈనెల 20న ఈ కోర్టు ప్రత్యక్షంగా హాజరై ఆయన చేపట్టిన కూల్చివేతలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా రాజశేఖర్‌కు వివరించి చెప్పాలని హైడ్రా తరఫు న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అప్పటివరకు వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని స్పష్టంచేసింది. అలగారి ప్రవీణ్‌ అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామపరిధిలో సర్వే నెంబర్‌ 296లో రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ ద్వారా ఇంటిస్థలం కొనుగోలు చేశారు. అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టారు. పార్కు స్థలంలో షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ఆయనపై స్థానిక డెవలపర్స్‌ ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ ఆదివారం వచ్చి కూల్చివేతలు చేపట్టారు. ఆ ఆస్తికి సంబంధించి సివిల్‌ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో బాధితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ప్రత్యక్షంగా హాజరు కావాలని హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ను ఆదేశించింది.

Updated Date - Feb 18 , 2025 | 04:38 AM