Harish Rao: తెలంగాణ పాలిట.. రేవంత్, ఉత్తమ్ తెల్ల ఏనుగులు
ABN , Publish Date - May 25 , 2025 | 03:41 AM
కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా భారంగా మారిందనడం సరికాదని.. నిజానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లే తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

ఒకరు ఆదాయానికి, మరొకరు నీటి వాటాకు
అసమర్థతతో గండికొడుతున్నారు
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. తుమ్మిడిహెట్టి పనులు చేపట్టలేదు
కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి: హరీశ్
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా భారంగా మారిందనడం సరికాదని.. నిజానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లే తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అసమర్థతతో ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుంటే, మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారని ఓ ప్రకటనలో ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంపుహౌజ్‌లను వాడుకుంటూనే... ఆ ప్రాజెక్టుపై ఉత్తమ్ మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నారని హరీశ్ మండిపడ్డారు. చెప్పిన అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉత్తమ్ ఉన్నారని విమర్శించారు. కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప.. గత ఏడాదిన్నరలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని పేర్కొన్నారు. గతంలో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు, అప్పటికే చేసిన ఖర్చు వృథా కాకుండా ఉండేందుకు ప్రాణహిత ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేసి, కాళేశ్వరం చేపట్టామని వివరించారు.
ఎస్‌ఎల్‌బీసీ కూలడానికి కాంగ్రెస్సే కారణం
కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందని హరీశ్‌రావు విమర్శించారు. జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ అప్పట్లో కాగ్ రిపోర్టు ఇవ్వడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కానీ ఆరు ఎకరాలకు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా పక్కన పెట్టడం వల్లే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిందని మంత్రి ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3,200 కోట్లు ఖర్చు చేసి 12 కిలోమీటర్లు సొరంగం తవ్వడంతోపాటు డిండి, పెండ్లిపాకల పనులు పూర్తి చేశామని వివరించారు. దీనిపై హైదరాబాద్‌లోనైనా, హుజూర్‌నగర్‌లోనైనా చర్చిద్దాం రావాలని ఉత్తమ్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, హడావుడి పనులతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిందని, 8 మంది ప్రాణాలు బలయ్యాయని ఆరోపించారు. ప్రమాదం జరిగి వంద రోజులైనా.. సొరంగంలోని మృతదేహాలను బయటికి తీయని అసమర్థులని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..