Kaleshwaram project: మోటార్లు మీరు ఆన్ చేస్తారా? మేం ఆన్ చేయాలా?
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:17 AM
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనే అబద్ధపు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. గోదావరిలో వరద జలాలను ఒడిసిపట్టకుండా, వృధాగా సముద్రంలోకి వదిలేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రభుత్వం కుట్ర
వరద నీటిని ఒడిసిపట్టకుండా వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు
ఎస్సారెస్పీలోకి నీళ్లొస్తున్నా మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ ఎందుకు నింపట్లేదు?
కాళేశ్వరం మోటార్లు పాడయ్యేలా కుట్రలు
రైతుల్ని గోసపెడ్తరా?: హరీశ్ ధ్వజం
సిద్దిపేట ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనే అబద్ధపు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. గోదావరిలో వరద జలాలను ఒడిసిపట్టకుండా, వృధాగా సముద్రంలోకి వదిలేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల కోసం రైతులపై పగ తీర్చుకుంటోందని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లికి భారీగా వరద వస్తోందని, మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు మిడ్‌మానేరులోకి వచ్చిపడతాయని.. అయినా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదని చెప్పారు. ‘మోటార్లు మీరు ఆన్ చేస్తారా? లేక వేలాది మంది రైతులతో కలసి వచ్చి మేమే మోటార్లు ఆన్ చేయాలా?’ అని నిలదీశారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. కడెం ప్రాజెక్టు నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద ఎల్లంపల్లికి వస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంపుహౌస్, నంది మేడారంలో మోటార్లు స్విచాన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయి. వారం కిందటే మంత్రి ఉత్తమ్‌కు దీనిపై లేఖ రాశాం. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయని.. వరద నీటిని ఎత్తిపోసి నింపాలని కోరాం. కానీ స్పందన లేదు. మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లన్నీ సముద్రంలోకి వదులుతున్నారు’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. వానలు సరిగా లేక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెరువులు నిండలేదని, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుని, వరద నీటిని ఒడిసిపట్టాలన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోటార్లను ఆన్ చేయడం లేదా? కృష్ణా ప్రాజెక్టులకు వరదలతో ఉచితంగా జల విద్యుత్తు అందుతోంది. దానితో మోటార్లు నడిపించి రిజర్వాయర్లు నింపడానికి రేవంత్‌రెడ్డికి, ఉత్తమ్‌కు ఏం అడ్డం వచ్చింది? మిడ్ మానేరు, ఎల్‌ఎండీ ఖాళీగా ఉన్నాయి. ఎస్సారెస్పీలోకి వరద వస్తున్నా వరద కాలువ తెరిచి వాటిలోకి నీళ్లు ఎందుకు వదలడం లేదు?’’ అని హరీశ్‌రావు నిలదీశారు. రిజర్వాయర్లన్నీ నింపితే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయని చెప్పారు.
మోటార్లు పాడయ్యేలా కుట్ర!
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల నిర్వహణలో ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. వాటిని తరచూ ఆన్, ఆఫ్ చేస్తూపోతే పాడైపోయి వేల కోట్ల నష్టం వస్తుందని హరీశ్‌రావు ఆరోపించారు. బీహెచ్‌ఈఎల్ సంస్థ కూడా దీనిపై ప్రభుత్వాన్ని హెచ్చరించిందని చెప్పారు. మోటర్లు పాడైపోయేలా చేసి బీఆర్‌ఎ్‌సను బద్నాం చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తాను అవగాహనతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ