దక్షిణాదికీ వ్యాపిస్తున్న జీబీఎస్
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:54 AM
ఇటీవల మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) నెమ్మదిగా దక్షిణాదికీ వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా.. ఇటీవలే తెలంగాణలో కూడా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి మరణం నమోదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఇటీవల మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) నెమ్మదిగా దక్షిణాదికీ వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా.. ఇటీవలే తెలంగాణలో కూడా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్ కారణంగా మృతిచెందడం కలకలం రేపింది. తొలుత శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఆ బాలుడిని ఆ తర్వాత రాగోలులోని జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారి బ్రెయిన్‌డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకూ 200కుపైగా అనుమానిత కేసులు బయటపడ్డాయి. వారిలో 52 మంది ప్రస్తుతం ఇంటెన్సిటివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. 20 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. జీబీఎస్ కారణంగా ముంబైలో తొలి మరణం నమోదైంది.
ఈ నెల 10న కూడా ముంబైలో 53 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ మొత్తం 8 మరణాలు సంభవించాయి. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీవ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన, తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ.. తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంటుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.