Share News

Top Rankers: వాయిదా పడినా.. పట్టు వీడలేదు

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:54 AM

పదో తరగతి ఖమ్మంలో, ఇంటర్‌ విజయవాడ, బీటెక్‌ తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో పూర్తి చేశా. సివిల్స్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

Top Rankers: వాయిదా పడినా.. పట్టు వీడలేదు

గ్రూప్‌ 2 ర్యాంకర్ల మనోగతం

గ్రూప్‌ 2 ఫలితాలు వెలువడ్డాయి. విజేతలందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తొలి మూడు స్థానాలు సాధించిన ర్యాంకర్లు తమ ప్రయాణాన్ని ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. నాలుగుసార్లు పరీక్ష వాయిదా పడ్డా పట్టువీడకుండా, తమ ప్రిపరేషన్‌ కొనసాగించి విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వీరికి భిన్న అనుభవాలు ఉన్నాయి. మొదటి ర్యాంకర్‌ హర్షవర్ధన్‌ రెడ్డి తొలి పరీక్షలోనే విజయం సాధించగా, రెండో ర్యాంకర్‌ సచిన్‌ పోటీ పరీక్షల్లో ఒకటి, రెండు పర్యాయాలు విఫలమైనా మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు. మూడో ర్యాంకర్‌ మనోహర్‌ రావు రాసిన ప్రతీ పరీక్షలో దాదాపుగా విజయం సాధించాడు. అయితే విజేతలు ముగ్గురు కూడా ప్రస్తుతం ఉద్యోగంలో చేరినప్పటికీ సివిల్స్‌ లక్ష్యంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

సివిల్సే నా లక్ష్యం

మొదటి ర్యాంకర్‌ వెంకట హర్షవర్ధన్‌రెడ్డి

గ్రూప్స్‌తో ఆగిపోతారా? వేరే లక్ష్యం ఉందా?

పదో తరగతి ఖమ్మంలో, ఇంటర్‌ విజయవాడ, బీటెక్‌ తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో పూర్తి చేశా. సివిల్స్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

పోటీ పరీక్షలకు స్ఫూర్తి ఎవరు?

నాన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌. అందుకే నాకు ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి మొదలైంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజల్లో ఉండే ఆదరణ, ప్రజాసేవ చేయడానికి వాళ్లకి ఉండే అవకాశాల గురించి నాన్న వివరించేవారు. దీంతో ప్రభుత్వ కొలువు సాధించాలని లక్ష్యం ఏర్పడింది. ఇప్పుడు మొదటి అడుగు పడింది. ఇక యూపీఎస్సీకి ప్రిపేర్‌ కావాలని నిర్ణయించుకున్నాను.

సివిల్స్‌ కోచింగ్‌ ఏమైనా తీసుకున్నారా?

బీటెక్‌ పూర్తికాగానే ఢిల్లీలోని ‘వాజీరాం అండ్‌ రవి’ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్‌లో సంవత్సరం పాటు కోచింగ్‌ తీసుకున్నాను. మూడు గంటలు కోచింగ్‌కు వెళ్లిన తర్వాత మిగిలిన సమయం ఇంటి వద్ద చదువుకునేవాడిని.

టీజీపీఎస్సీ వైపు ఎందుకు వచ్చారు?

ఏడాది నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నా. ఇదే సమయంలో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో తొందరగా జాబ్‌ సాధించవచ్చనే ఉద్దేశంతో గ్రూప్స్‌కు సిద్ధం అయ్యాను. మంచి ఫలితం వచ్చింది.

స్టేట్‌ ఫస్టు ర్యాంకు సాధించారు.. ఏ ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నారు?

డిప్యూటీ తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టుల్లో ఏదో ఒకటి వస్తుందని భావిస్తున్నాను.

యూపీఎస్సీ లక్ష్యం అన్నారు కదా?

ఉద్యోగంలో చేరిన తరువాత కూడా నా ప్రిపరేషన్‌ ఆపను. యూపీఎస్సీపై దృష్టి సారిస్తాను.


సెల్ఫ్‌ మోటివేషన్‌తోనే సక్సెస్‌

మీ నేపథ్యం ఏమిటి? ఏమి చదువుకున్నారు?

మాది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల. అయితే సిద్దిపేటలోనే స్థిరపడ్డాం. అమ్మ పేరు సుజాత, నాన్న శ్రీనివాస్‌ రెడ్డి. నాన్న సివిల్‌ కాంట్రాక్టర్‌. ఏడో తరగతి వరకు సిద్దిపేటలో చదువుకున్నా. టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. ఢిల్లీలోని బీఎంఎల్‌ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాను.

ఇంజనీరింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి ఇటెలా వచ్చారు?

2019లో బీటెక్‌ పూర్తి కాగానే ఐటీ కంపెనీలో చేరి సంవత్సరం పనిచేశాను. కొవిడ్‌ లాక్‌డౌన్‌తో ఇంటి నుంచే పనిచేశా. అప్పుడే పోటీ పరీక్షల వైపు ఆసక్తి కలిగింది. సివిల్స్‌ రాద్దామని నిర్ణయించుకుని సొంతంగా సిద్ధం కావడం మొదలు పెట్టా. 2021, 2022లో రెండుసార్లు సివిల్స్‌ అటెంప్ట్‌ చేసినా.. ఫలితం దక్కలేదు. అదే సమయంలో టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు రావడంతో గ్రూప్స్‌కు దరఖాస్తు చేశాను. ఈసారి మరింతగా సిద్ధం అవ్వాలని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకున్నాను.

మధ్యలో ఎప్పుడైనా నిరుత్సాహనికి గురయ్యారా?

పరీక్ష చివరి వరకు వచ్చి, దాదాపు నాలుగుసార్లు వాయిదా పడింది. అప్పుడు అసహనంగా ఉండేది. కొన్నిసార్లు సమయం వృథా చేస్తున్నామా అనే అనుమానం కూడా వచ్చేది. ఎమోషనల్‌గా డిస్ట్రబ్‌ అయ్యేవాడిని. ఒక సందర్భంలో మళ్లీ ఐటీకి వెళ్లిపోదామని అనుకున్నా కూడా. కొన్ని కొత్త కోర్సులు నేర్చుకున్నా. ఉద్యోగాలకు అప్లై కూడా చేశాను. కానీ మళ్లీ ఒక్కసారి ఆలోచించాను. ఇన్ని రోజుల కష్టం వృథా అవుతుంది కదా.. కొద్దిరోజులు చూద్దామని నిర్ణయించుకున్న. అనుకున్నట్టే మంచి ఫలితం వచ్చింది. గ్రూప్‌-1లోనూ 461.5 మార్కులు వచ్చాయి.

ఉద్యోగ సాధనలో ఎవరైనా రోల్‌ మోడల్‌ ఉన్నారా?

ప్రత్యేకించి రోల్‌ మోడల్‌ అంటూ ఎవరు లేరు. సక్సెస్‌ అయిన వాళ్లవి, టాపర్స్‌ వీడియోలు చూస్తుంటాను. మా తాత సిరిసినగండ్ల వెంకట్‌రెడ్డి నాతో పాటు మా ఫ్యామిలిలో అందరినీ మోటివెట్‌ చేసేవారు. ఆయన రిటైర్డ్‌ టీచర్‌. బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని చెబుతుండేవారు. ఆయన ప్రభావం నాపై ఉంది.

మీ నెక్స్ట్‌ టార్గెట్‌ ఏంటి?

గ్రూప్‌-2 ఫలితంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. పైనల్‌గా నా టార్గెట్‌ మాత్రం సివిల్స్‌. అదే లక్ష్యంతో ముందుకెళ్తాను. పోటీ పరీక్షలు అంటే కనీసం రెండు, మూడు సంవత్సరాలు ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడే ఫలితం వచ్చే అవకాశం ఉంది.


అమ్మ ప్రేరణతోనే వరుస ఉద్యోగాలు

గ్రూప్‌-2 మూడో ర్యాంకర్‌ మనోహర్‌రావు

వరుసగా ఉద్యోగాలు సాధించడానికి ప్రేరణ ఎవరు?

మాది మారుమూల వ్యవసాయం కుటుంబం. నాన్న పండరినాథ్‌రావు రైతు. అమ్మ కమలమ్మ అంగన్‌వాడీ కార్యకర్త. ముగ్గురు సోదరులం. అన్న వ్యవసాయం చేస్తుంటాడు. తమ్ముడు వ్యవసాయశాఖలో ఏఈవో. అమ్మ ఇచ్చిన ప్రేరణతోనే వరుసగా ఉద్యోగాలు సాధించా. మా ఆవిడ మనీష సహకారం కూడా ఉంది.

ప్రిపరేషన్‌లో ఎవరి సహాయమైనా ఉందా?

6 నెలల పాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందాను. అక్కడి గైడెన్స్‌ బాగా ఉపయోగపడింది. రోజుకు పదిహేను, పద్దెనిమిది గంటలు చదువుపై దృష్టిపెట్టాను. పరీక్షల నిర్వహణలో జాప్యం కారణంగా నిరుత్సాహ పడ్డా. అయితే మళ్లీ పరీక్ష తేదీల ప్రకటన రావడంతో ఉత్తేజంతో చదువు మొదలు పెట్టేవాడిని.

ఇప్పటి వరకు ఏయే ఉద్యోగాలు సాధించారు?

నారాయణఖేడ్‌లోనే ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు చదివి, హైదరాబాద్‌లోని వీవీ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసి గోల్డ్‌ మెడల్‌ సాధించాను. మొదటగా 2017లో టీజీటీలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, పీజీటీలో మూడవ స్థానం వచ్చింది. అయినప్పటికీ పీజీటీ ఉద్యోగంలో చేరాను. అనంతరం స్కూల్‌ అసిస్టెంట్‌గా కూడా ఎంపికయ్యాను. గతంలో కూడా గ్రూప్‌-2లో ర్యాంకు సాధించి, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డిటీగా విధులు నిర్వహించి, అనారోగ్యం వల్ల తిరిగి ఉపాధ్యాయుడిగా తిరిగి చేరాను. ప్రస్తుతం మెదక్‌ జిల్లా కొల్చారాం మండలం అన్‌సాన్‌పల్లిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. జేఎల్‌గా కూడా అవకాశం వచ్చింది. గ్రూప్‌-1లో 430 మార్కులు వచ్చాయి.

మళ్లీ గ్రూప్‌-1 లేదా సివిల్స్‌కు ఏమైనా

ప్రిపేర్‌ అయ్యే ఆలోచన ఉందా?

సివిల్స్‌ లేదా డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం సాధించడం నా లక్ష్యం. అందుకోసం అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను.

కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంది?

అమ్మ, నాన్న, అన్నదమ్ములు అందరి సహకారం ఉంది. ప్రతీ విషయంలో నాకు కుటుంబం మద్దతుగా నిలబడింది. నా వివాహం 2014లో జరిగింది. భార్య పేరు మనీష. మాకు ప్రస్తుతం ఒక పాప, బాబు ఉన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 05:54 AM