Share News

Groundwater Pollution: జలమే గరళం!

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:33 AM

నేడు భూగర్భ జలాలు కాలుష్యమై చాలామందికి సురక్షిత, స్వచ్ఛమైన తాగునీరు అందకుండా పోతోంది. కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) తాజా నివేదిక దేశంలో పెరుగుతున్న జల కాలుష్యం, దాంతో వచ్చే అనారోగ్య సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

Groundwater Pollution: జలమే గరళం!

  • పల్నాడు జిల్లాలోని భూగర్భ జలాల్లో అధికంగా నత్రజని

  • తెలంగాణలో రంగారెడ్డి, ఆదిలాబాద్‌, సిద్దిపేటల్లోనూ..

  • దేశంలోని 440 జిల్లాల్లో భూగర్భ జలాలు విషతుల్యం

  • అనేక ప్రాంతాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్‌, ఆర్సెనిక్‌

  • కేంద్ర భూగర్భ జలమండలి తాజా నివేదికలో ఆందోళన

న్యూఢిల్లీ, జనవరి 2: నేడు భూగర్భ జలాలు కాలుష్యమై చాలామందికి సురక్షిత, స్వచ్ఛమైన తాగునీరు అందకుండా పోతోంది. కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) తాజా నివేదిక దేశంలో పెరుగుతున్న జల కాలుష్యం, దాంతో వచ్చే అనారోగ్య సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పల్నాడు, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, సిద్దిపేటతోపాటు దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నత్రజని స్థాయిలు అధికంగా ఉన్నాయని సీజీడబ్ల్యూబీ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో 20శాతం వాటిలో అనుమతించినస్థాయి కంటే అధిక నత్రజని గుర్తించినట్టు తెలిపింది. నత్రజని ఆధారిత ఎరువులు, జంతు వ్యర్థాలను ఎక్కువ వినియోగించే ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. అలాగే 9.04శాతం నమూనాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్‌ స్థాయిలు ఉన్నాయని, 3.55శాతం శాంపిల్స్‌లో ఆర్సెనిక్‌ కనిపించినట్టు తెలిపింది. 2023 మేలో భూగర్భ జలాల నాణ్యతను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా మొత్తం 15,259 ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు.


వాటిని పరీక్షించగా 20శాతం శాంపిల్స్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నిర్దేశించిన లీటరుకు 45 మిల్లీగ్రాముల నత్రజని పరిమితికంటే అధికంగా ఉంది. రాజస్థాన్‌, కర్ణాటక, తమిళనాడుల్లో 40శాతం నమూనాల్లో కాలుష్య స్థాయిలు ఎక్కువున్నట్టు గుర్తించారు. మహారాష్ట్రలో 35.74శాతం, తెలంగాణలో 27.48శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 23.5శాతం, మధ్యప్రదేశ్‌లో 22.58శాతం శాంపిల్స్‌లో కాలుష్యం అధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, హరియాణాల్లో 2017 నుంచి 2023 వరకు నీటి కాలుష్యం పెరిగిందని గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌, కేరళ, ఝార్ఖండ్‌, బిహార్‌ల్లో కాలుష్యం తక్కువ ఉన్నట్టు నివేదిక పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, గోవా, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లో భూగర్భ జలాలు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. నీటిలో నైట్రేట్‌ స్థాయిలు అధికంగా ఉంటే తాగేందుకు సురక్షితం కాదని, ఇది శిశువుల్లో బ్లూ బేబీ సిండ్రోమ్‌ వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది.


దేశవ్యాప్తంగా 15జిల్లాల్లో నైట్రేట్‌ స్థాయిలు అధికంగా ఉన్నట్టు సీజీడబ్ల్యూబీ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, తెలంగాణలోని రంగారెడ్డి, ఆదిలాబాద్‌, సిద్దిపేటతోపాటు రాజస్థాన్‌లోని బార్మర్‌, జోధ్‌పూర్‌, మహారాష్ట్రలోని వార్దా, బుల్దానా, అమరావతి, నాందేడ్‌, బీడ్‌, జల్గావ్‌, యవాత్మల్‌, తమిళనాడులోని విల్లుపురం, పంజాబ్‌లో భతిం దాజిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్‌ స్థాయిలు ఎక్కువ ఉన్నట్టు తెలిపింది. రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో పరిమితికి మించి ఫ్లోరైడ్‌ సాంద్రత ఉండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా, పంజాబ్‌, తమిళనాడు, ఏపీ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సేకరించిన నమూనాల్లో యురేనియం సాంద్రత అధికంగా ఉండడాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఓవరాల్‌గా తెలంగాణ, ఏపీ, రాజస్థాన్‌, ఢిల్లీ, గుజరాత్‌, హరియాణా, పంజాబ్‌, కర్ణాటకల్లో జల కాలుష్యం అధికంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

Updated Date - Jan 03 , 2025 | 06:33 AM