Share News

Greenfield Road: గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పనులకు లైన్‌ క్లియర్‌..

ABN , Publish Date - Jul 31 , 2025 | 08:00 AM

హైదరాబాద్‌ మహా నగరానికి, ఫ్యూచర్‌ సిటీకి లింకు చేసే ప్రధాన రహదారి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ప్రభుత్వ భూముల్లోనే రోడ్డు పనులు చేపట్టేందుకు హైకోర్టు అనుమతులిచ్చింది. దాంతో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసే చర్యలను హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ గ్రోథ్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) చేపట్టింది.

Greenfield Road: గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పనులకు లైన్‌ క్లియర్‌..

- ప్రభుత్వ భూముల్లోనే పనులు

- పోటీ పడిన ఏడు నిర్మాణ సంస్థలు.. రెండు ఎంపిక

- ప్యాకేజీ-1 పనులు మెస్సర్స్‌ రిత్విక్‌కు,

- ప్యాకేజీ-2 పనులు ఎల్‌అండ్‌టీకి

- అధికారికంగా ఖరారు చేస్తూ హెచ్‌జీసీఎల్‌ ప్రకటన

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరానికి, ఫ్యూచర్‌ సిటీకి లింకు చేసే ప్రధాన రహదారి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు(Greenfield Road) పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ప్రభుత్వ భూముల్లోనే రోడ్డు పనులు చేపట్టేందుకు హైకోర్టు అనుమతులిచ్చింది. దాంతో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసే చర్యలను హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ గ్రోథ్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) చేపట్టింది. రెండు ప్యాకేజీల్లో తాజాగా ప్రైస్‌ బిడ్‌ కూడా చేశారు. ఒక్కో ప్యాకేజీకి ఒక్కో సంస్థ చొప్పున రెండు నిర్మాణ సంస్థలు ఎంపికయ్యాయి.


అన్ని సంస్థలూ అదనంగా కోట్‌ చేయడంతో ఉన్నంతలో ప్యాకేజీ-1కు నిర్ణయించిన విలువ కంటే 3.93 శాతం అదనంగా కోట్‌ చేసిన మెస్సర్స్‌ రిత్విక్‌ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌ను, ప్యాకేజీ-2కు నిర్ణయించిన విలువ కంటే 4.20శాతం అదనంగా కోట్‌ చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థను ఎంపిక చేసినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌(Hyderabad, Secunderabad, Cyberabad) తరహాలోనే నాలుగో నగరంగా రాబోతున్న ఫ్యూచర్‌ సిటీకి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డుగా గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


city3.2.jpg

రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాలు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్‌, అమన్‌గల్‌ పరిధిలోని 14 గ్రామాల మీదుగా గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి అలైన్‌మెంట్‌ ఖరారైంది. 41.5 కిలోమీటర్లలో, 300 అడుగులతో (వంద మీటర్లు) రోడ్డును నిర్మించనుండగా, ఇరువైపులా సర్వీసు రోడ్డులు, సైకిల్‌ ట్రాక్‌, ఫుట్‌పాత్‌, మెట్రోరైలు నిర్మాణానికి అనుగుణంగా డిజైన్‌ చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ పూర్తయితే ప్రస్తుతమున్న హైదరాబాద్‌-నాగార్జున్‌సాగర్‌ ప్రధాన రోడ్డుపై, హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ గణనీయంగా తగ్గనుంది.


అప్పుడే టెండర్లు ఆహ్వానించగా..

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి మూడు నెలల క్రితమే అధికారులు వేర్వేరుగా టెండర్లను ఆహ్వానించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు రావిర్యాల (టాటా ఇంటర్‌ఛేంజ్‌) నుంచి ఫ్యూచర్‌ సిటీ మీర్‌ఖాన్‌పేట వరకు 19.20 కిలోమీటర్లు ప్యాకేజీ-1లో రూ.1665 కోట్లతో పనులు చేపట్టాలని, మీర్‌ఖాన్‌పేట నుంచి అమన్‌గల్‌ వద్ద రీజినల్‌ రింగ్‌ రోడ్డు (రతన్‌టాటా రోడ్డు) వరకు 22.30 కిలోమీటర్లు ప్యాకేజీ-2లో రూ.2,365 కోట్లతో పనులకు టెండర్లను హెచ్‌ఎండీఏలోని హెచ్‌జీసీఎల్‌ చేపట్టింది. ఒక ప్యాకేజీకి మూడు సంస్థలు, మరో ప్యాకేజీకి నాలుగు సంస్థలు నిర్మాణానికి ముందుకొచ్చాయి. భూసేకరణ పూర్తవ్వకముందే రోడ్డు నిర్మాణ పనులు ఏవిధంగా చేపడతారని కొందరు భూయజమానులు కోర్టుకెక్కడంతో టెండర్‌ ప్రక్రియ నిలిచిపోయింది.


రెండు సంస్థలు ఎంపిక

హైకోర్టు అనుమతులతోనే ఇటీవల ప్రైస్‌ బిడ్‌ను ఓపెన్‌ చేశారు. రెండు ప్యాకేజీల పనుల నిమిత్తం ఉన్నవాటిలో తక్కువ కోట్‌ చేసిన రెండు నిర్మాణ సంస్థలను ఎంపిక చేశారు. టెండర్‌ కమిటీ సిపార్సుల మేరకు సాంకేతికంగా అర్హత కలిగిన తక్కువ కోట్‌ చేసిన నిర్మాణ సంస్థలను మాత్రమే ఎంపిక చేశామని, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించామని హెచ్‌జీసీఎల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.


ప్రభుత్వ భూముల్లోనే పనులు

హైకోర్టుకు వేసవి సెలవుల తర్వాత గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణంపై హెచ్‌ఎండీఏ పలు అంశాలను కోర్టుకు నివేదించినట్లు తెలిసింది. 300 అడుగులతో 41.50 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డుకు 1,003 ఎకరాల వరకు భూములు కావాల్సి ఉన్నది. ఇందులో టీజీఐఐసీ భూములు 202 ఎకరాలు కాగా, ఫారెస్టు భూములు 232 ఎకరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, పట్టా భూములు 569 ఎకరాల్లో సేకరించిన తర్వాతే పనులు చేస్తామని వివరించినట్లు సమాచారం. టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి అందుబాటులో ఉన్న 434 ఎకరాల ప్రభుత్వ భూముల్లోనే పనులు చేస్తామని చెప్పడంతో హైకోర్టు అంగీకరించినట్లు తెలిసింది.


రోడ్డు ప్రతిపాదన ఇలా..

- ఔటర్‌ ఎగ్జిట్‌-13 రావిర్యాల (టాటా ఇంటర్‌ఛేంజ్‌) నుంచి కొంగరఖుర్దు,

కొంగరకలాన్‌, ఫిరోజ్‌గూడ, లేమూర్‌, తిమ్మాపూర్‌, రచ్లూర్‌, గుమ్మడవెల్లి,

పంజగూడ, మీర్‌ఖాన్‌పేట (ప్యూచర్‌ సిటీ) వరకు (19.20 కిలోమీటర్లు)

- అక్కడి నుంచి ముచ్చెర్ల, కుర్మిద్ధ, కడ్తాల్‌, ముద్విన్‌, అమన్‌గల్‌, ఆకుతోటపల్లి వద్ద రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు (22.30 కిలోమీటర్లు).


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 08:00 AM