Cultural Events: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:11 AM
ఈ ఏడాది బతుకమ్మ సంబరాలను ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అపూర్వ రీతిలో నిర్వహించనున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 21న వరంగల్ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ సంబరాలను..
21న వేయి స్తంభాల గుడి వద్ద సంబరాలు
27న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్
28న 10వేల మంది మహిళలతో వేడుక
బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క
హైదరాబాద్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది బతుకమ్మ సంబరాలను ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అపూర్వ రీతిలో నిర్వహించనున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 21న వరంగల్ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ సంబరాలను ఆరంభించి, 30వ తేదీ వరకు రాష్ట్రం నలుమూలలా అన్ని వర్గాల మహిళలు ఉత్సాహంగా పాల్గొనేలా పర్యాటక, సాంస్కృతిక శాఖలు కార్యాచరణ రూపొందించాయని చెప్పారు. 28న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో 10 వేల మందికి పైగా మహిళలు గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని తెలిపారు. సోమవారం సచివాలయంలో జూపల్లి మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘రియో కార్నివాల్’ తరహాలో రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. 22 నుంచి 24 వరకు ప్రతి రోజూ 3-4 జిల్లాల్లో ముఖ్య ఆలయాలు, పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో బతుకమ్మ వేడుకలు ఏర్పాటు చేస్తామన్నారు. 25 నుంచి 4 రోజుల పాటు మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఇతివృత్తంలో కళా శిబిరం,పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో సరస్ బజార్ నిర్వహిస్తామన్నారు. 27న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్ జరుగుతుందని తెలిపారు. 28న బతుకమ్మ సైకిల్ పరేడ్ రైడ్, 29న మహిళల బైకర్ రైడ్, 30న వింటేజ్ కార్ల ర్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీల్లో ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు పాల్గొంటారన్నారు. 30న ట్యాంక్ బండ్ వద్ద పూలతో అలంకరించిన శకటాల ప్రదర్శన, ఫ్లోరల్ హోలీ నిర్వహిస్తామని తెలిపారు. హుస్సేన్ సాగర్ జలాల్లోకి బతుకమ్మ ఆకారంలో అలంకరించిన తెప్పలను (ఫ్లోట్స్) విడుదల చేస్తామని చెప్పారు. ఆడబిడ్డల పోరుగడ్డ వరంగల్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తొలి బతుకమ్మ వేడుకలు నిర్వహించడం విశేషమని మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ పండుగ పువ్వులనే కాకుండా చెరువులను సైతం పూజించే పండుగ అని మంత్రి సీతక్క చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News