Share News

Multi-Service Centers: మలిసంధ్యలో ఉత్సాహ పొద్దు

ABN , Publish Date - Jun 03 , 2025 | 06:08 AM

ఉదయం నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటూ బోర్‌ ఫీలయ్యే వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం “మల్టీ సర్వీస్‌ డే కేర్‌ సెంటర్లు” ప్రారంభించబోతోంది. 60 ఏళ్ల పైబడిన వయోధికులు మానసిక, శారీరక ఉల్లాసంతో గడిపేందుకు 37 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. చెస్‌, క్యారమ్స్‌, యోగ, ధ్యానం, వైద్య సేవలు, కౌన్సెలింగ్‌, వృద్ధులకు సరైన ఆహారం, పుస్తకాలు, టీవీ, వైఫై తదితర వసతులు ఈ కేంద్రాల్లో లభిస్తాయి.

Multi-Service Centers: మలిసంధ్యలో ఉత్సాహ పొద్దు

రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్‌ డే కేర్‌ సెంటర్లు

వృద్ధుల్లో ఒంటరితనాన్ని దూరం చేసేందుకే

క్యారమ్స్‌, చెస్‌ వంటి గేమ్స్‌.. యోగా, ధ్యానం ఏర్పాట్లు

ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం.. త్వరలోనే టెండర్లు

హైదరాబాద్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉదయం తొమ్మిదింటికే డ్యూటీ వెళ్లేవారు వెళ్లిపోవడంతో, పిల్లలు బడికి వెళ్లిపోవడంతో ఇంట్లోని పెద్దమనుషులు పలకరించేవారు లేక సమయాన్ని భారంగా గడుపుతున్నారు. ఈ రోజుల్లో చాలా ఇళ్లలోని వృద్ధులు ఇలా రోజంతా బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ సమస్య నుంచి వారిని బయటపడేసేందుకు త్వరలోనే ‘మల్టీ సర్వీస్‌ డే కేర్‌ సెంటర్లు’ వచ్చేస్తున్నాయి. అక్కడ టైంపాస్‌ అవ్వడం లేదన్న మాటే లేకుండా వృద్ధులు రోజంతా హాయిగా గడిపేయొచ్చు. ఈ మేరకు 60 ఏళ్లుపైబడిన వారు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా గడిపేందుకు డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, హనుమకొండ జిల్లాల్లో రెండేసి కేంద్రాలు, మిగతాజిల్లాల్లో ఒక సెంటర్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కొత్త భవనాలు నిర్మించడమో, కొన్నిచోట్ల అద్దె భవనాలు తీసుకోవడమో చేస్తున్నారు. ప్రతి డే కేర్‌ సెంటర్లో అధునాతన వసతులు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఈ మేరకు త్వరలోనే డే కేర్‌ సెంటర్ల నిర్వహణ కోసం టెండర్లు పిలుస్తారు. జిల్లా సంక్షేమ అధికారుల నిరంతర పర్యవేక్షణలో ఈ సెంటర్లు నడుస్తాయి. ఈ కేంద్రాల ఏర్పాటు తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్నిచోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ కోసం రూ.90వేల చొప్పున విడుదల చేశారు. ప్రతి కేంద్రంలో 50 మంది వయోధికులకు సేవలందించేలా ఏర్పాట్లుంటాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కేంద్రాలు ఊరటనిస్తాయని, గౌరవంగా, సంతోషంగా జీవించడానికి వేదిక అవుతున్నాయని సీతక్క పేర్కొన్నారు.

చెస్‌, క్యారమ్స్‌.. ఉప్మా, జ్యూస్‌

డే కేర్‌ సెంటర్లలో వృద్ధులు ఇతర సీనియర్‌ సిటిజెన్స్‌తో ఉల్లాసంగా గడపడంలో భాగంగా క్యారమ్స్‌, చెస్‌ తదితర గేమ్స్‌ ఆడుకునే ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాంగణంలో సేదతీరేందుకు పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుస్తక ప్రియుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తారు. అక్కడ వార్తాపత్రికలు కూడా అందుబాటులో ఉంచుతారు. టీవీ చూడొచ్చు. వైఫై సౌకర్యమూ ఉంటుంది. యోగ, ధ్యానం చేసుకునేవారికి ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. వారానికి రెండుసార్లు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఉచితంగా మందులు ఇస్తారు. కుటంబ సమస్యల కారణంగా మానసిక వేదనతో సతమతమవుతున్న వారి కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇస్తారు. నడవలేని వారికి వీల్‌చైర్లు, ఇతర సహాయ పరికరాలు అందుబాటులో ఉంచుతారు. రాగి జావ, పండ్లు, జ్యూస్‌, ఉప్మా, టీ, బిస్కెట్లు వంటి ఆహారాన్ని అందజేస్తారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 06:09 AM