Yoga Day: యోగాతో ప్రపంచ ఐక్యత
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:00 AM
ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా ఐక్యం కావడానికి యోగా ఉపయోగపడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.
ఆరోగ్య భారత్ నిర్మాణంలో పౌరులంతా భాగమవ్వాలి: గవర్నర్ జిష్ణుదేవ్
యోగాను మతంతో ముడిపెట్టడం సరికాదు: వెంకయ్యనాయుడు
భారత్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా: కిషన్‌రెడ్డి
కౌంట్‌డౌన్ వేడుకలో పాల్గొన్న సాయిదుర్గాతేజ్, తేజ సజ్జ, మీనాక్షి
నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం
గచ్చిబౌలిలో 5వేల మందితో కార్యక్రమం
బర్కత్‌పుర, హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా ఐక్యం కావడానికి యోగా ఉపయోగపడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి భారత నవ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శుక్రవారం కౌంట్‌డౌన్ మహోత్సవం నిర్వహించారు. కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడుతూ.. యోగా దినోత్సవం, జూన్ 21 భారతదేశం గర్వించదగ్గ రోజు అని చెప్పారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని మోదికే దక్కిందన్నారు. నేడు ప్రపంచమంతా యోగాను ఆచరిస్తుండడంతో భారతదేశం విశ్వగురువుగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యోగా ఒక థెరపీ, మెడిసిన్, అన్ని సమస్యలకు రెమిడీ అని అన్నారు. యోగాకు జాతి, మతం లేదని, అందరి జీవన విఽధానమని చెప్పారు. అలాంటి యోగాకు మతంతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. సర్వధర్మాలకు సంబంధించిన ఆరోగ్య శాస్త్రం యోగా అని అన్నారు. యోగాపై అనవసరమైన రాజకీయాలు చేయడం తగదని సూచించారు. యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగే వేడుక తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం అన్నారు. ఇక, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు. యోగానే మనకు ప్రథమ డాక్టర్ అని, యోగా సర్వరోగ నివారిణి అని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అన్నారు. 200 దేశాలు యోగాను ఆచరిస్తున్నాయనే విషయం భారతీయులంతా గర్వించాల్సిన అంశమని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ కౌంట్‌డౌన్ మహోత్సవంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్రప్రసాద్, ఎమ్మెల్వే పాల్వయి హరీష్, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నరసింహరావు, సినీ నటులు సాయి దుర్గాతేజ్, తేజ సజ్జ, మీనాక్షి చౌదరి, కుష్బూ, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
5వేల మందితో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం ‘యోగా డే’ను నిర్వహిస్తున్నారు. సుమారు 5వేల మందితో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 8.30గంటల వరకు రెండు గంటలపాటు సాగే వేడుకలకు ఆయుష్, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో భాగంగా ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా తన సందేశం ఇస్తారు. ఇక 7 గంటల నుంచి 7.45 గంటల వరకు అంతా యోగా చేస్తారు. 7.50 నుంచి 8.20 గంటల వరకు గవర్నర్, సీఎం ఇతర ప్రముఖులు ప్రసంగిస్తారు. కాగా, యోగాను రాష్ట్రంలో ప్రతీ ఇంటికి చేరువ చేసేందుకు ప్రభుత్వం గతేడాది 628 మంది యోగా గురువులను నియమించిందని, ఈ ఏడాది మరో 250మంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయుష్ అధికారులు శుక్రవారం తెలిపారు. కొత్తగా నియామకమైన యోగా గురువులు ఇప్పటివరకు 5లక్షల మందికి యోగా నేర్పించారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..