KTR in the Formula E car race case: కేటీఆర్ విచారణకుఅనుమతి
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:13 AM
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ను ప్రశ్నించారు.....
ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చజెండా
ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం
చార్జిషీటు దాఖలుకు ఏసీబీ సన్నాహాలు
రేవంత్ ఆదేశించారు.. గవర్నర్ పాటించారు!
ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కుట్ర: బీఆర్‌ఎస్
కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపులకు పోదు
చట్టప్రకారమే విచారణ: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్, ఇతర నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన వినతిని సెప్టెంబరు 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. దీనిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కూడా అనుమతినివ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే డీవోపీటీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్.. అర్వింద్‌కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఇక డీవోపీటీ అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది. ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి గతేడాది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మంత్రివర్గం అనుమతి లేకుండా, సచివాలయ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు విడుదలకు అనుమతినివ్వడంతో హెచ్‌ఎండీఏకు రూ. 54.88 కోట్ల నష్టం జరిగిందంటూ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్, అర్వింద్, బీఎల్‌ఎన్‌రెడ్డితో పాటు గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని, ఫార్ములా-ఈ రేసు సీఈవోను పలుమార్లు విచారించారు. అనేక సాక్ష్యాధారాలను సేకరించారు. కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగాయని నిర్ధారించుకున్న అధికారులు.. సెల్‌ఫోన్, ట్యాబ్‌ను అప్పగించాలంటూ నోటీసులిచ్చారు. ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గతే డాది డిసెంబరు 19న కేసు నమోదుచేశారు. సాక్ష్యాధారాలను సేకరించిన ఏసీబీ.. త్వరలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనుంది. కేటీఆర్ తదితరులపై నమోదైన సెక్షన్లు బెయిలుకు వీల్లేనివి కావడంతో ఆయన్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
రేవంత్ ఆదేశించారు.. గవర్నర్ పాటించారు: బీఆర్‌ఎస్
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై బీఆర్‌ఎస్ నేతలు స్పందించారు. ‘సీఎం రేవంత్ ఆదేశించారు.. గవర్నర్ పాటించారు’ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు సురేశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ గొంతు నొక్కాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్‌ఎ్‌సపై చేస్తున్న కుట్ర తేటతెల్లమైందని చెప్పారు.